Uppal: ఉప్పల్‌లో ఇండోర్‌ బ్యాడ్మింటన్‌ స్టేడియం ప్రారంభించిన ఎమ్మెల్యే

Uppal: ఉప్పల్‌లో నూతన ఇండోర్‌ బ్యాడ్మింటన్‌ స్టేడియాన్ని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, జోనల్‌ కమిషనర్‌ రాధికా గుప్తా ప్రారంభించి క్రీడాకారులకు అందుబాటులోకి తెచ్చారు.

KARUNAKAR, UPPAL
Published on: 5 Nov 2026 6:21 PM IST
Uppal
X

Uppal: ఉప్పల్‌లో ఇండోర్‌ బ్యాడ్మింటన్‌ స్టేడియం ప్రారంభించిన ఎమ్మెల్యే

ఉప్పల్‌: స్థానిక క్రీడాకారులకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ఉప్పల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండోర్‌ బ్యాడ్మింటన్‌ స్టేడియంను ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, జోనల్‌ కమిషనర్‌ రాధికా గుప్తా ప్రారంభించారు.

క్రీడలు విద్యార్థులు, యువతలో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతోపాటు జట్టుగా పనిచేసే నైపుణ్యాలను అభివృద్ధి చేస్తాయని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. స్థానికంగా నాణ్యమైన క్రీడా సదుపాయాలు అందుబాటులోకి రావడం వల్ల యువ క్రీడాకారులు తమ ప్రతిభను మెరుగుపరుచుకుని ఉన్నత స్థాయి పోటీల్లో రాణించేందుకు అవకాశం కలుగుతుందన్నారు.

మౌలిక వసతుల అభివృద్ధితోపాటు క్రీడా సదుపాయాల కల్పనకు కూడా మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రాధాన్యమిస్తోందని జోనల్‌ కమిషనర్‌ రాధికా గుప్తా పేర్కొన్నారు. యువత క్రీడలపై ఆసక్తి పెంచుకునేలా ఇలాంటి వసతులు దోహదపడతాయని తెలిపారు. స్టేడియాన్ని పరిశుభ్రంగా, సక్రమంగా నిర్వహిస్తూ క్రీడాకారులకు మెరుగైన వాతావరణం కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

స్టేడియం అందుబాటులోకి రావడంతో వర్షం, ఎండ వంటి వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు సాధన చేసుకునే వెసులుబాటు కలగనుంది. విద్యార్థులు, యువత ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని క్రీడారంగంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉప్పల్‌ డీసీ ఆనంద్‌ కుమార్‌, ఎస్‌ఈ రమేష్‌ బాబు, డిప్యూటీ ఈఈ వెనెల్‌, ఎస్‌డబ్ల్యూఎం డిప్యూటీ ఈఈ నీళిమ, గేమ్స్‌ ఇన్‌స్పెక్టర్‌ విఘ్నేష్‌ తదితరులు పాల్గొన్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL