Uppal: ఉప్పల్ రింగ్ రోడ్డులో ‘Arrive Alive’ రోడ్డు భద్రతా సదస్సు

Uppal: మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి ఆదేశాల మేరకు ఉప్పల్ రింగ్ రోడ్డు చౌరస్తాలో ‘Arrive Alive’ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

KARUNAKAR, UPPAL
Published on: 11 Jun 2026 6:31 AM IST
Uppal
X

Uppal: ఉప్పల్ రింగ్ రోడ్డులో ‘Arrive Alive’ రోడ్డు భద్రతా సదస్సు

ఉప్పల్: రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రతి ఒక్కరూ సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలనే లక్ష్యంతో తెలంగాణ పోలీసులు చేపట్టిన ‘Arrive Alive’ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం ఉప్పల్‌ లో ఘనంగా నిర్వహించారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఉప్పల్ రింగ్ రోడ్డు చౌరస్తా వద్ద, పోలీస్ కమిషనర్ సుమతి ఆదేశాల మేరకు ఉప్పల్ పోలీసుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గుప్తా, డీసీపీ సురేష్ కుమార్, మేడ్చల్ జిల్లా వైద్యాధికారి డా. ఉమా గౌరీ, ఆర్టీవో సురేష్‌, డిప్యూటీ కమిషనర్ శైలజతో పాటు రోడ్డు భద్రత విభాగ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వాహనదారులు, ఆటో డ్రైవర్లు, విద్యార్థులతో అధికారులు నేరుగా మాట్లాడి రాంగ్‌రూట్ డ్రైవింగ్, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్ మరియు సీట్‌బెల్ట్ వినియోగించకపోవడం వల్ల జరిగే ప్రమాదాల తీవ్రతను వివరించారు. కొన్ని క్షణాల నిర్లక్ష్యం జీవితాంతం విషాదానికి కారణమవుతుందని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదం ఒక వ్యక్తి ప్రాణాన్నే కాకుండా అతని కుటుంబ భవిష్యత్తును కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుందని పేర్కొంటూ, వాహనం నడిపే ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులను గుర్తు చేసుకుంటూ ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం, అతివేగంగా ప్రయాణించడం వంటి ప్రమాదకర అలవాట్లకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.

చలాన్లు విధించడం, జరిమానాలు వసూలు చేయడం కంటే ప్రజల్లో బాధ్యతాయుతమైన డ్రైవింగ్ అలవాట్లు పెంపొందించి ప్రాణాలను కాపాడడమే ‘Arrive Alive’ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. రోడ్డు భద్రత అనేది ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని స్పష్టం చేశారు. “ఇంట్లో మీ కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు.. ట్రాఫిక్ నిబంధనలు పాటించండి.. క్షేమంగా ఇంటికి చేరండి” అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం వాహనదారుల్లో విశేష చైతన్యాన్ని కల్పించింది.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story