Uppal: ప్రయాణికుల గోస.. పట్టించుకోని అధికారులు!
Uppal: ఉప్పల్ రింగ్ రోడ్డులో ఎలివేటెడ్ కారిడార్ పనుల వల్ల బస్టాప్‌లను నల్ల చెరువుకు మార్చారు.
Uppal: ప్రయాణికుల గోస.. పట్టించుకోని అధికారులు!
Uppal: ఉప్పల్ ప్రాంతంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఉప్పల్ రింగ్ రోడ్డులోని ప్రధాన బస్ స్టాప్‌లను తాత్కాలికంగా నల్ల చెరువు కట్ట సమీపానికి మార్చారు. వరంగల్, హనుమకొండ, యాదగిరిగుట్ట, తొర్రూర్ వంటి ప్రాంతాలకు వెళ్లే బస్సులు ఇకపై ఈ తాత్కాలిక బస్ స్టాప్ నుంచే అందుబాటులోకి వచ్చాయి. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు, నిర్మాణ పనులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు ఈ మార్పులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
ప్రయాణికులు ముందుగానే తమ ప్రయాణాలను ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. అయితే, నల్ల చెరువు వద్ద ఏర్పాటు చేసిన బస్ స్టాప్‌లో కనీస సౌకర్యాలు లేకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. దీనిని గమనించిన బస్సు డ్రైవర్లు ఉప్పల్ రింగ్ రోడ్డు వద్దకు బస్సులను తీసుకొని వెళ్లగా అక్కడి ట్రాపిక్ పోలీసులు నల్ల చెరువు వద్దకు వెళ్లాలని బస్సులను తరలిస్తున్నారు. ఎండాకాలం కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
ఉప్పల్ నల్ల చెరువు కట్ట వద్ద ఏర్పాటు చేసిన బస్టాప్ ల వద్ద తాగునీటి సదుపాయం లేకపోవడం, వృద్ధులు కూర్చునేందుకు బెంచీలు లేకపోవడం, సరైన షెల్టర్ లేకపోవడం వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. కేవలం టెంట్ ఏర్పాటు చేయడంతో ప్రయాణికులకు సరైన రక్షణ లభించడం లేదు. అంతేకాకుండా, ఏ బస్సు ఎక్కడ ఆగుతుందనే విషయంపై సూచిక బోర్డులు లేకపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
దుబ్బ రోడ్ల కారణంగా దుమ్ము ఎగిసిపడుతూ ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బస్ స్టాప్‌ల మార్పు విషయంలో ముందస్తు ప్రణాళికతో వ్యవహరించిన అధికారులు, ప్రయాణికుల సౌకర్యాల విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తాగునీరు, కూర్చునే ఏర్పాట్లు, షెల్టర్లు, సూచిక బోర్డులు వంటి కనీస వసతులు కల్పించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.




