Uppal: రెండు రోజులుగా ఆర్‌టీఏ ఆఫీసుల్లో పనులు బంద్
Uppal: హైదరాబాద్ ఉప్పల్ ఆర్టీఏ (RTA) కార్యాలయంలో సాంకేతిక సమస్యల కారణంగా రవాణా శాఖ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Uppal: రెండు రోజులుగా ఆర్‌టీఏ ఆఫీసుల్లో పనులు బంద్
ఉప్పల్: సాంకేతిక సమస్య ఆర్టీఏ సేవలకు తీవ్ర అంతరాయం కలిగించింది. దేశవ్యాప్తంగా వాహన్, సారథి సర్వర్లు మొరాయించడంతో ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయంలో గత రెండు రోజులుగా సేవలు నిలిచిపోయాయి. లెర్నింగ్ లైసెన్స్‌లు, డ్రైవింగ్ లైసెన్స్ సంబంధిత పనులు, వాహన రిజిస్ట్రేషన్ సేవల కోసం వచ్చిన ప్రజలు గంటల తరబడి కౌంటర్ల వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
స్లాట్లు బుక్ చేసుకుని వచ్చిన యువకులు, విద్యార్థులు, ఉద్యోగులు సర్వర్ సమస్య కారణంగా పనులు పూర్తికాక నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. కార్యాలయంలో కౌంటర్లు తెరిచి ఉన్నప్పటికీ ఆన్‌లైన్ వ్యవస్థ పనిచేయకపోవడంతో అధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. సర్వర్ సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందా అని ఎదురుచూస్తున్న ప్రజలు, వెంటనే సేవలు పునరుద్ధరించాలని కోరుతున్నారు.
ఈ సందర్భంగా ఉప్పల్ ఆర్టీఓ సురేష్ రెడ్డి మాట్లాడుతూ.. “వాహన్, సారథి సర్వీసులు ఢిల్లీ కేంద్ర సర్వర్ నుంచి నిర్వహించబడతాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సర్వర్ సమస్య తలెత్తడంతో రవాణా శాఖ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.
వాహన్‌లో వాహనాలకు సంబంధించిన సేవలు, సారథిలో లైసెన్స్ సేవలు అందుతాయని, సర్వర్ కనెక్షన్ పునరుద్ధరించగానే సేవలు సాధారణ స్థితికి వస్తాయని ఆర్టీవో సురేష్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న వారు సమస్య పరిష్కారం అయ్యే వరకు తమ అపాయింట్‌మెంట్‌ను వాయిదా వేసుకోవాలని ఆర్టీఏ అధికారులు సూచించారు.




