Uppal: రామంతాపూర్‌లో ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రంపై ఉప్పల్ ఎస్‌వోటీ దాడి

Uppal: ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతాపూర్‌లో కుళ్ళిన, గడువు ముగిసిన రసాయనాలతో ఐస్‌క్రీమ్స్ తయారు చేస్తున్న కేంద్రంపై SOT పోలీసులు ఆకస్మిక దాడి చేశారు.

KARUNAKAR, UPPAL
Published on: 15 July 2026 8:42 AM IST
Uppal
X

Uppal: రామంతాపూర్‌లో ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రంపై ఉప్పల్ ఎస్‌వోటీ దాడి

ఉప్పల్: ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రంపై ఉప్పల్ ఎస్‌వోటీ (SOT) పోలీసులు మంగళవారం ఆకస్మికంగా దాడి నిర్వహించారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతాపూర్ లక్ష్మీనారాయణ కాలనీలో ఉన్న శ్రీ లక్ష్మి డైరీ ప్రొడక్ట్స్ పేరుతో నడుస్తున్న ఐస్‌క్రీమ్ తయారీ యూనిట్‌లో తనిఖీలు చేపట్టగా, గడువు ముగిసిన ఫుడ్ కలర్స్, ఫ్లేవర్లు, ఫంగస్ పట్టిన డ్రైఫ్రూట్స్‌తో పాటు లేబుల్ లేని పదార్థాలను వినియోగిస్తున్నట్లు గుర్తించారు.

తనిఖీల్లో సుమారు 2 కిలోల ఫంగస్ పట్టిన ఎండు అంజీర్, గడువు ముగిసిన త్రిశూల్ సింథటిక్ ఫుడ్ కలర్, వీకేఎల్ ఫుడ్ ఫ్లేవర్, నాలుగు బాక్సుల ఐడాకాల్ సింథటిక్ ఫుడ్ కలర్, నాలుగు డబ్బాల గడువు ముగిసిన లూజ్ సింథటిక్ ఫుడ్ కలర్, సుమారు 1.5 కిలోల లూజ్ టూటీ ఫ్రూటీ స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటినీ ఐస్‌క్రీమ్ తయారీలో ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించి సీజ్ చేశారు.

యూనిట్ నిర్వాహకుడు మందుల రమేష్ ను అదుపులోకి తీసుకున్న ఎస్‌వోటీ పోలీసులు, స్వాధీనం చేసుకున్న వస్తువులతో కలిసి తదుపరి చట్టపరమైన చర్యల కోసం ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేందుకు గడువు ముగిసిన ఫుడ్ కలర్స్, ఫ్లేవర్లు, లేబుల్ లేని ముడి పదార్థాలను ఉపయోగించి ఐస్‌క్రీమ్ తయారు చేసి స్థానిక రిటైల్ దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు నిందితుడు అంగీకరించినట్లు ఉప్పల్ పోలీసుల విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఉప్పల్ పోలీసులు, ఆహార భద్రత నిబంధనల ఉల్లంఘనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే నాసిరకం లేదా గడువు ముగిసిన ఆహార పదార్థాల తయారీ, నిల్వ, విక్రయాలపై నిరంతర తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉప్పల్ పోలీసులు హెచ్చరించారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story