Uppal: స్టేడియం సీసీటీవీలు బంద్ చేసి మరి దొంగతనం.. చివరకు ఏమైందంటే?

Uppal: ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో పవర్ కేబుల్స్ దొంగతనానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

KARUNAKAR, UPPAL
Published on: 8 May 2026 8:06 AM IST
Uppal
X

Uppal: స్టేడియం సీసీటీవీలు బంద్ చేసి మరి దొంగతనం.. చివరకు ఏమైందంటే?

ఉప్పల్: ఉప్పల్‌ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన కేబుల్ చోరీ కేసును ఉప్పల్ పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో ఒక నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌ కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్టేడియంలో పనిచేస్తున్న చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎల్. ఆనంద్ భాస్కర్ ఈ నెల 5న ఉప్పల్ పోలీస్ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 4వ తేదీ తెల్లవారుజామున స్టేడియం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పవర్ కేబుల్స్‌తో పాటు క్యాట్-6 నెట్‌వర్క్ కేబుల్స్‌ను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనతో స్టేడియంలోని సీసీటీవీ నిఘా వ్యవస్థకు అంతరాయం ఏర్పడినట్లు తెలిపారు.

ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ ను పరిశీలిస్తూ దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో జితు సోలంకి (20) అనే యువకుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు నర్సింగి ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు. విచారణలో అతడు నేరాన్ని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం జితు సోలంకి చిన్నప్పటి నుంచే తాత్కాలిక గుడిసెల్లో జీవిస్తూ వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ ఉండేవాడు. మద్యం, ధూమపానం వంటి అలవాట్లకు బానిసైన అతడు రాత్రి వేళల్లో స్టేడియం పరిసరాలను గమనించి కేబుల్స్‌ ను చోరీ చేసి, అనంతరం వాటిని గుర్తు తెలియని వ్యక్తులకు విక్రయించేవాడని తేలింది. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించినట్లు పోలీసులు వెల్లడించారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story