Uppal: చలానా స్థానంలో చైతన్యం.. హెల్మెట్ బ్యాంక్‌తో ఉప్పల్ పోలీసుల కొత్త సందేశం
Uppal: ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద శిక్ష కంటే చైతన్యమే లక్ష్యంగా 'హెల్మెట్ బ్యాంక్' కార్యక్రమం ప్రారంభం. హాజరైన డీసీపీ శ్రీనివాసులు, ట్రాఫిక్ పోలీసులు.
Uppal: చలానా స్థానంలో చైతన్యం.. హెల్మెట్ బ్యాంక్‌తో ఉప్పల్ పోలీసుల కొత్త సందేశం
ఉప్పల్: రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టాన్ని తగ్గించి, ద్విచక్ర వాహనదారుల్లో హెల్మెట్ వినియోగంపై అవగాహన పెంపొందించేందుకు మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఉప్పల్ ట్రాఫిక్ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పోలీస్ కమిషనర్ సుమతి ఆదేశాలు, ట్రాఫిక్-2 డీసీపీ శ్రీనివాసులు పర్యవేక్షణలో ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద 'హెల్మెట్ బ్యాంక్' కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సాధారణంగా హెల్మెట్ లేకుండా ప్రయాణించే ద్విచక్ర వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు చలానా విధిస్తారు. అయితే ఉప్పల్ ట్రాఫిక్ పోలీసులు శిక్ష కంటే చైతన్యానికే ప్రాధాన్యం ఇస్తూ వినూత్న విధానాన్ని అమలు చేస్తున్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారులను ఆపి, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన అనంతరం వారి ప్రభుత్వ గుర్తింపు కార్డు (ఐడీ ప్రూఫ్) వివరాలను నమోదు చేసి, హెల్మెట్ బ్యాంక్ నుంచి ఒక హెల్మెట్‌ను తాత్కాలికంగా అందజేస్తున్నారు.
హెల్మెట్ తీసుకున్న వాహనదారుడు 24 గంటల్లోపు దానిని తిరిగి పోలీసులకు అప్పగించాల్సి ఉంటుంది. తిరిగి వచ్చిన హెల్మెట్లను శుభ్రపరిచి, అవసరమైన ఇతర వాహనదారులకు అందుబాటులో ఉంచుతూ ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగించనున్నారు. ఈ సందర్భంగా డీసీపీ శ్రీనివాసులు మాట్లాడుతూ, "జరిమానా భయంతో కాదు... ప్రాణాల భద్రత కోసం హెల్మెట్ ధరించాలి" అని అన్నారు.
ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చునే ప్రయాణికుడు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని సూచించారు. "ఒక హెల్మెట్... ఒక ప్రాణానికి రక్షణ" అనే సందేశంతో ప్రారంభమైన ఈ హెల్మెట్ బ్యాంక్ కార్యక్రమం చలానాలకే పరిమితం కాకుండా ప్రజల్లో రోడ్డు భద్రతపై బాధ్యతను పెంపొందిస్తూ, హెల్మెట్ ధరించే అలవాటును విస్తరింపజేయడంలో ఆదర్శవంతమైన కార్యక్రమంగా నిలుస్తోంది. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ కుమార్, ఏసీపీ సంపత్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు నాగరాజు, గోవర్ధన్, సబ్ ఇన్స్పెక్టర్ మధు సుధన్, ట్రాఫిక్ సిబ్బంది, వాహనదారులు పాల్గొన్నారు.




