Hyderabad: వనస్థలిపురంలో బీటెక్ విద్యార్థిని అదృశ్యం.. పోలీసుల గాలింపు
Hyderabad: హైదరాబాద్ వనస్థలిపురం పరిధిలో విశాఖపట్నం వెళ్తానని ఇంటి నుంచి బయలుదేరిన బీటెక్ విద్యార్థిని భార్గవి (20) అదృశ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేశారు.
Hyderabad: వనస్థలిపురంలో బీటెక్ విద్యార్థిని అదృశ్యం.. పోలీసుల గాలింపు
హైదరాబాద్: వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో బీటెక్ విద్యార్థిని అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. బీఎన్ రెడ్డి నగర్ కాలనీ, ఈసీ నగర్‌కు చెందిన గోవిందరావు కుమార్తె భార్గవి (20) విశాఖపట్నంలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. అనారోగ్య కారణాలతో రెండు నెలల క్రితం ఇంటికి వచ్చిన ఆమె.. తిరిగి హాస్టల్‌కు వెళ్తానని కుటుంబ సభ్యులకు చెప్పింది.
ఈ క్రమంలో నవంబర్ 1న రాత్రి 8.30 గంటలకు వనస్థలిపురంలోని కేఎల్ఎం షాపింగ్ మాల్ సమీపంలో విశాఖపట్నం వెళ్లేందుకు మినీ బస్సు ఎక్కింది. అనంతరం ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో తల్లి శోభారాణి వనస్థలిపురం పోలీసులను ఆశ్రయించారు.
ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. యువతి ఆనవాళ్లు: ఎత్తు 4 అడుగుల 8 అంగుళాలు, తెల్లని ఛాయ. తెలుగు మాట్లాడుతుంది. యువతి ఆచూకీ తెలిసిన వారు వనస్థలిపురం పోలీసులను సంప్రదించాలని కోరుతున్నారు.




