Vikarabad: మున్సిపల్ కార్మికుల ధర్నాకు బీఆర్‌ఎస్ మద్దతు
Vikarabad: వికారాబాద్‌లో మూడు నెలలుగా జీతాలు అందక మున్సిపల్ కార్మికుల నిరసన. ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపిన బీఆర్‌ఎస్ నేత మల్కాపురం చైతన్య కిరణ్.
Vikarabad: మున్సిపల్ కార్మికుల ధర్నాకు బీఆర్‌ఎస్ మద్దతు
వికారాబాద్: వికారాబాద్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు గత మూడు నెలలుగా జీతాలు అందకపోవడంతో వారు చేపట్టిన ధర్నా, ర్యాలీలో BRS నాయకులు, అడ్వకేట్ మల్కాపురం చైతన్య కిరణ్ గారు ఈరోజు ఉదయం పాల్గొని కార్మికులకు సంఘీభావం తెలిపారు.
ప్రజల ఆరోగ్యం, పట్టణ పరిశుభ్రత కోసం ప్రతిరోజూ కష్టపడుతున్న మున్సిపల్ కార్మికులు తమ కుటుంబాలను పోషించుకునేందుకు జీతాలపైనే ఆధారపడుతున్నారని, అలాంటి కార్మికులకు మూడు నెలలుగా జీతాలు చెల్లించకపోవడం తీవ్రంగా బాధాకరమని చైతన్య కిరణ్ గారు అన్నారు.
స్పీకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే, ఆయన కుమార్తె మున్సిపల్ చైర్మన్‌గా ఉన్న వికారాబాద్ మున్సిపాలిటీలో కార్మికులు మూడు నెలల జీతాల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి రావడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు.
కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో, KTR మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో మున్సిపల్ కార్మికులకు గౌరవం, భరోసా ఉండేదని, జీతాలు, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చేదని గుర్తు చేశారు.
నాడు సంతోషంగా విధులు నిర్వహించిన మున్సిపల్ కార్మికులు, నేడు తమ జీతాల కోసం ధర్నాలు, ర్యాలీలు చేయాల్సిన పరిస్థితి రావడం ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.
వెంటనే మూడు నెలల పెండింగ్ జీతాలను చెల్లించి కార్మికుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికుల న్యాయమైన పోరాటానికి BRS పూర్తి మద్దతుగా ఉంటుందని, వారి సమస్య పరిష్కారం అయ్యే వరకు అండగా నిలుస్తామని చైతన్య కిరణ్ గారు స్పష్టం చేశారు.




