Vikarabad: గుడ్ల ధరలపై టెండర్‌దారులతో కలెక్టర్ సమావేశం
Vikarabad: వికారాబాద్‌లో పాఠశాలలు, అంగన్‌వాడీలకు గుడ్ల సరఫరా ధరలపై కలెక్టర్ టెండర్‌దారులతో సమావేశమై, నాణ్యమైన గుడ్లు సకాలంలో అందించాలని ఆదేశించారు.
Vikarabad: గుడ్ల ధరలపై టెండర్‌దారులతో కలెక్టర్ సమావేశం
వికారాబాద్: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే గుడ్ల ధరల నిర్ణయంపై జిల్లా కలెక్టర్ టెండర్‌దారులతో సమావేశం నిర్వహించారు. గురువారము వీడియో కాన్ఫరెన్సు హాలు నందు సంక్షేమ అధికారులతో జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే గుడ్ల ధరలపై జిల్లా కలెక్టర్ టెండర్‌దారులతో సమావేశం నిర్వహించారు.
గుడ్ల ప్రస్తుత మార్కెట్ ధరలు, కొనుగోలు ధరలు, రవాణా ఖర్చులు, సరఫరా వ్యయం తదితర అంశాలపై చర్చించారు. గుడ్ల ధరలను సమీక్షించి, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సరైన ధర నిర్ణయించే అంశంపై కలెక్టర్ టెండర్‌దారుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులు, చిన్నారులకు పోషకాహార పథకాల అమలులో ఎలాంటి అంతరాయం కలగకుండా నాణ్యమైన గుడ్లను నిర్ణీత సమయంలో సరఫరా చేయాలని కలెక్టర్ సూచించారు. గుడ్ల ధరలను పారదర్శకంగా నిర్ణయించాలని, ప్రభుత్వానికి ఆర్థిక భారం పడకుండా చూడాలని, సరఫరాదారులు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు.
గుడ్ల ధరల విషయంలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, ఏం జే ఆర్ పౌల్ట్రీ, గీత పౌల్ట్రీ ,జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.




