Vikarabad: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా అమలుపై కలెక్టర్ సమీక్ష
Vikarabad: వికారాబాద్ జిల్లాలో 18-59 ఏళ్ల అర్హులకు రూ.5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాను ఈ నెల 19 నుంచి అమలు చేయనున్నట్లు కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు.
Vikarabad: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా అమలుపై కలెక్టర్ సమీక్ష
వికారాబాద్: జిల్లా లో ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా యోజన పథకం ద్వారా 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన అర్హులకు 5 లక్షల రూపాయల జీవిత బీమా సదుపాయం కల్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. మంగళవారము కలెక్టర్ అధ్యక్షతన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా ప్రయోజనం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఈ పథకాన్ని ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభించి నెల రోజుల్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వయస్సు ,ధ్రువీకరణకు ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు. త్వరలోనే మొబైల్ అప్లికేషన్ అందుబాటులోకి వస్తుందని అయన తెలిపారు.
ఈ పథకంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించేందుకు మండల స్థాయిలో గ్రామాలలో సర్పంచులతో సమావేశాలు, మున్సిపల్ కార్యాలయాల్లో, మున్సిపల్ వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం అదనపు కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ యాప్లో కుటుంబాల వివరాలను సమగ్రంగా నమోదు చేయాలని సూచించారు.
ప్రతి గ్రామపంచాయతీకి ప్రత్యేక లాగిన్ ఉంటుందని, కుటుంబ యజమాని తన భార్యను నామినీగా నమోదు చేయాలని తెలిపారు. రేషన్ కార్డు ఆధారంగా పథకం అమలు చేయాలని, ఆధార్ కార్డులో పుట్టిన తేదీ లేనట్లయితే జూలై 1వ తేదీని ప్రామాణికంగా తీసుకోవాలని అయన సూచించారు.
దరఖాస్తులో ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలని, నామినీ పేరు నమోదు చేయడంతో పాటు కుటుంబ యజమాని సమర్పించిన దరఖాస్తు ఫారాన్ని కూడా యాప్లో అప్లోడ్ చేయాలనీ, ఈ నెల 19వ తేదీ నుంచి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని, పట్టణ ప్రాంతాలలో నేరుగా వివరాల నమోదు, గ్రామీణ ప్రాంతాలలో క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా దరఖాస్తుల ప్రక్రియ చేపట్టాలని అధికారులకు సూచించారు.
రేషన్ కార్డులు లేని అర్హులైన కుటుంబాలకు కూడా పథకం ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అదనపు కలెక్టర్ వెంకటాచారి మాట్లాడుతూ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతిష్టాత్మక పథకమని తెలిపారు.
ఈ పథకం అమలులో అధికారులు పూర్తి బాధ్యతతో వ్యవహరించి, ప్రజలకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు. పథకానికి సంబంధించిన ఆన్లైన్ లాగిన్ సదుపాయం పంచాయతీ కార్యదర్శులు, వార్డు అధికారులకు మాత్రమే ఉంటుందని తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ అధికారులు పరస్పర సమన్వయంతో సహకరించి, ఎలాంటి ఆటంకాలు లేకుండా పథకాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.
ఈ సమావేశములో ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టుర్, డి ఆర్ డి ఏ శ్రీనివాస్, డి పి ఓ జయసుధ, సి పి ఓ వెంకటేశ్వర్లు , ఎల్ డి ఎం మహమూద్, ఏం పి డి ఓ లు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.




