Vikarabad: బీజేఆర్ చౌరస్తాలో విధులు బహిష్కరించి ధర్నా చేసిన మున్సిపల్ సిబ్బంది!
Vikarabad: రెండు నెలల పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ మున్సిపల్ కార్మికులు విధులు బహిష్కరించి బీజేఆర్ చౌరస్తాలో నిరసన చేపట్టారు.
Vikarabad: బీజేఆర్ చౌరస్తాలో విధులు బహిష్కరించి ధర్నా చేసిన మున్సిపల్ సిబ్బంది!
Vikarabad: రెండు నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ మున్సిపల్ కార్మికులు గురువారం తమ విధులను బహిష్కరించి బీజేఆర్ చౌరస్తాలో నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీ గదుల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్న ప్రభుత్వం, తెల్లవారకముందే విధుల్లోకి వచ్చి పట్టణంలోని వీధులు, మలమూత్రాలు, చెత్తాచెదారం శుభ్రం చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న మున్సిపల్ కార్మికుల జీతాలు చెల్లించడంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని ప్రశ్నించారు.
ప్రభుత్వాలు మారినా మున్సిపల్ శాఖ విషయంలో కార్మికుల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమను రెగ్యులర్ చేయడంతో పాటు వేతనాలు పెంచాలని, జీతాలను ప్రతినెలా సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేశారు.
తాము కూడా భారత పౌరులమేనని, ప్రభుత్వం తమకు అప్పగించిన మున్సిపల్ పరిశుభ్రత బాధ్యతలను ఎలాంటి విరామం లేకుండా నిర్వర్తిస్తున్నామని తెలిపారు. పట్టణాలను పరిశుభ్రంగా ఉంచేందుకు కష్టపడుతున్న తమ కుటుంబాలు జీతాలు ఆలస్యం కావడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రెండు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయడంతో పాటు, మున్సిపల్ కార్మికులను రెగ్యులర్ చేసి వేతనాలు పెంచాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.




