Vikarabad: ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.. అదనపు కలెక్టర్ ఆదేశం
Vikarabad: వికారాబాద్ జిల్లాలో 129 వరి కొనుగోలు కేంద్రాలను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని అదనపు కలెక్టర్ కె.వెంకటాచారి అధికారులను ఆదేశించారు.
Vikarabad: ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.. అదనపు కలెక్టర్ ఆదేశం
Vikarabad: జిల్లాలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె.వెంకటా చారి అధికారులను ఆదేశించారు. సోమవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, అకాల వర్షాల వల్ల వరి ధాన్యం తడవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర లతో కలిసి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లాల ఇన్చార్జి మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లు ఆన్లైన్ ద్వారా తమ సూచనలను, అభిప్రాయాలను వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె.వెంకటాచారి అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. .జిల్లాలోని 129 వరి కొనుగోలు కేంద్రాల్లో అన్ని సదుపాయాలను సమకూర్చుకొని రైతులకు అందుబాటులోకి తీసుకొని రావాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వరి ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారుల సూచించారు.
మార్కెటింగ్ అధికారులు వరి కొనుగోలు కేంద్రాలకు గోనె సంచులను సరఫరా చేయాలని సంబంధిత అధికారికి ఆదేశించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో తూనిక, తేమ, వరిని ఆరబెట్టే యంత్రాలతో పాటు తాడిపత్రీలను సమకూర్చుకోవాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిచిపోకుండా ముందస్తుగానే తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.
కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పౌరసరఫరాల జిల్లా మేనేజర్ మురళీకృష్ణ, జిల్లా పౌరసరఫరాల అధికారి సుదర్శన్, డిఆర్డిఓ శ్రీనివాస్, డిసిఒ నాగార్జున, డీసీఎంఎస్ బిజినెస్ మేనేజర్ వెంకట్ రెడ్డి, అదనపు డిఆర్డిఓ నర్సింలు తదితరులు పాల్గొన్నారు.




