Vikarabad: కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శలు
Vikarabad: వికారాబాద్‌లో కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు.
Vikarabad: కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శలు
వికారాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కేంద్రంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్, శుభప్రద్ పటేట్, బైండ్ల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ కార్యక్రమంలో పాల్గొన్నా మాజీ సీఎం కేసీఆర్‌ను విమర్శించడం తప్ప రాష్ట్రానికి చేసిన అభివృద్ధి ఏముందని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలపై హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
విద్యార్థుల సభల్లో సైతం ముఖ్యమంత్రి అనుచిత భాష ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఎక్కడుందని ప్రశ్నిస్తూ.. ప్రజా పాలన అంటున్న ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. గత ప్రభుత్వం పేదలకు ఇచ్చిన పాస్‌బుక్‌లను సైతం ప్రస్తుత ప్రభుత్వం లెక్కచేయడం లేదని ఆరోపించారు.
మైనార్టీలకు కేటాయించిన భూముల విషయంలోనూ అక్రమాలు జరుగుతున్నాయని విమర్శించారు. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే విధంగా జీవో 97 తీసుకొచ్చారని, విద్యార్థులపై పోలీసులు దాడులు చేయడం సరికాదన్నారు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల గన్‌మెన్‌లను తొలగిస్తూ.. ముఖ్యమంత్రి సోదరులకు భద్రత కల్పిస్తున్నారని ఆరోపించారు.
చివరకు వారి ఇంట్లో కుక్కకు కూడా గన్‌మెన్ ఇస్తారేమోనని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఫైమ్ ఖురేషీతో పాటు వికారాబాద్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ భూములు పంచుకుని ల్యాండ్, శాండ్ వ్యాపారాలు చేస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.




