Vikarabad: అంతర్జాతీయ షూట్‌బాల్ పోటీలకు ఎంపికైన మహ్మద్ అయాన్‌కు సన్మానం

Vikarabad: నేపాల్‌లో జరగనున్న 1వ అంతర్జాతీయ షూట్‌బాల్ ఎమర్జింగ్ కప్‌నకు ఎంపికైన వికారాబాద్ యువకుడు మహ్మద్ అయాన్‌ను అభినందించిన శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్.

MOGULAIAH, VIKARABAD
Published on: 12 Nov 2026 8:03 PM IST
Vikarabad
X

Vikarabad: అంతర్జాతీయ షూట్‌బాల్ పోటీలకు ఎంపికైన మహ్మద్ అయాన్‌కు సన్మానం

వికారాబాద్: షూట్‌బాల్ క్రీడల్లో రాణిస్తున్న వికారాబాద్ నియోజకవర్గంలోని మోమిన్‌పేట్ మండలంలోని వెల్ చాల్ గ్రామానికి చెందిన మహ్మద్ షాబుద్దీన్ కుమారుడు మహ్మద్ అయాన్ ను తెలంగాణ శాసన సభాపతి, వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ అభినందించారు.

ఈ నెల 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నేపాల్ రాజధాని ఖాట్మండులో జరగనున్న 1వ అంతర్జాతీయ షూట్‌బాల్ ఎమర్జింగ్ కప్ టోర్నమెంట్‌లో భారతదేశం తరఫున మహ్మద్ అయాన్ పాల్గొననున్నాడు. భారతదేశం నుంచి ఈ పోటీలకు మొత్తం 12 మంది క్రీడాకారులు ఎంపికయ్యారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి షూట్‌బాల్ క్రీడల్లో ఎంపికైన ఏకైక క్రీడాకారుడు మహ్మద్ అయాన్ మాత్రమే. తెలంగాణ నుంచి ఈ అంతర్జాతీయ టోర్నమెంట్ కు ఎంపికైన ఏకైక క్రీడాకారుడిగా అయాన్ నిలిచాడు. ఈ పోటీల కోసం ఈ నెల 18వ తేదీన అయాన్ నేపాల్ కు బయలుదేరనున్నాడు.

ఈ నేపథ్యంలో గురువారం రోజు అయాన్, తన తండ్రి మహ్మద్ షాబుద్దీన్ వెల్ చాల్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. స్పీకర్ గారు అయాన్ ను అభినందించి, ఆల్ ది బెస్ట్ చెప్పారు.

ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణలో ప్రజా ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని, గ్రామీణ, పట్టణ క్రీడాకారులను ఎంతగానో ప్రోత్సహిస్తోందని చెప్పారు. క్రీడలే యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని, అందుకే ప్రజా ప్రభుత్వం క్రీడా మౌలిక వసతుల కల్పనకు, ప్రతిభావంతులైన క్రీడాకారులకు అండగా నిలవడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.

తన నియోజకవర్గంలోని క్రీడాకారులకు తప్పనిసరిగా అండగా ఉంటానని స్పీకర్ గారు హామీ ఇచ్చారు. నేపాల్ వేదికగా జరిగే అంతర్జాతీయ షూట్‌బాల్ ఎమర్జింగ్ కప్ టోర్నమెంట్‌లో మహ్మద్ అయాన్ *సత్తా చాటి, తెలంగాణ పేరును, వికారాబాద్ నియోజకవర్గం పేరును, తల్లిదండ్రుల పేరును నిలబెట్టాలని స్పీకర్ ఆకాంక్షించారు.

చదువులోనూ, క్రీడల్లోనూ రాణించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అయాన్ కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు సూచించారు. స్పీకర్ గారు అభినందించి, ఆశీర్వదించినందుకు అయాన్ తండ్రి మహ్మద్ షాబుద్దీన్, విజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD