Vikarabad: బంట్వారంలో చేయూత పెన్షన్లు పంపిణీ చేసిన స్పీకర్
Vikarabad: వికారాబాద్ జిల్లా బంట్వారం ఎంపీడీఓ కార్యాలయంలో లబ్ధిదారులకు నూతన చేయూత పెన్షన్ పత్రాలను శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పంపిణీ చేశారు.
Vikarabad: బంట్వారంలో చేయూత పెన్షన్లు పంపిణీ చేసిన స్పీకర్
వికారాబాద్: వికారాబాద్ నియోజకవర్గంలోని బంట్వారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి తెలంగాణ శాసనసభ స్పీకర్, వికారాబాద్ శాసనసభ్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు హాజరయ్యారు. బంట్వారం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా స్పీకర్ గారు మాట్లాడుతూ...
ఈ నెల 19వ తేదీన సిద్దిపేటలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని అమలు చేయబోతున్నారు. కులం, మతం, ఆదాయంతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల జీవిత బీమా అందించే గొప్ప పథకం ఇది అన్నారు.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం, సంక్షేమ పథకాలను అమలు చేయడం కోసం ప్రతిరోజూ 18 గంటల పాటు నిర్విరామంగా కష్టపడుతున్నారు. అలాంటి నాయకుడి నాయకత్వంలో తెలంగాణ ముందుకు వెళ్తోంది.
పెన్షన్ రావడం అనేది లబ్ధిదారులకు 12 ఏళ్ల కల. గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ రావాలంటే లబ్ధిదారులు ఎన్నో ఇబ్బందులు పడేవారు. కానీ ఈ ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందుతున్నాయి. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. అర్హులందరికీ న్యాయం చేస్తాం.
ప్రజా ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తోంది. గత ప్రభుత్వం 8 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసింది. వాటికి వడ్డీలు కూడా ప్రభుత్వమే కడుతోంది. ప్రజా ప్రభుత్వం ఎక్కడా సంక్షేమ పథకాలను ఆపడం లేదు. అభివృద్ధి కార్యక్రమాలను ఆపడం లేదు.
అన్ని వర్గాల సంక్షేమం కోసమే ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది. పార్టీలకు అతీతంగా, అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే నా ధ్యేయం. ప్రజా ప్రభుత్వ ధ్యేయం కూడా ఇదే. పథకాల విషయంలో అందరినీ అన్ని రకాలుగా ఆదుకుంటాం.
వికారాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాను. ఇప్పటికే ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం. ఇప్పటికే 1000 కోట్ల రూపాయల నిధులతో రోడ్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. మరికొన్ని చోట్ల త్వరలోనే ప్రారంభోత్సవాలు చేస్తాం. అన్ని గ్రామాలకు, అన్ని మండలాలకు రోడ్లతో పాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలు సమకూరుస్తాం. ఇచ్చిన హామీని నేను మర్చిపోను, కచ్చితంగా చేస్తాను.
గత ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదు. రైతులకు సంబంధించిన సబ్సిడీలను పూర్తిగా ఎత్తివేసింది. కానీ ఈ ప్రజా ప్రభుత్వం వచ్చాక రైతులకు అందాల్సిన సబ్సిడీలన్నీ అమలు చేస్తోంది. ముఖ్యమంత్రి గారు ఇప్పటికే రూ. 2 లక్షల రైతు రుణమాఫీ చేశారు. ఇచ్చిన హామీని నెరవేర్చారు.
ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పేరిట అర్హులైన మహిళలకు ఇండ్లు ఇస్తోంది. ఇండ్లు రాని వారు ఎవరూ నిరాశ చెందొద్దు. ఎవరికైనా ఇల్లు రాకపోతే మళ్లీ అప్లై చేసుకోండి, తప్పకుండా ఇస్తాము. మీ అందరికీ, ప్రతి ఒక్కరికీ ఇండ్లు వచ్చేలా నేను కృషి చేస్తాను.
ప్రభుత్వానికి మీ సహాయ సహకారాలు ఉండాలి, మమ్మల్ని దీవించండి. ముఖ్యమంత్రి గారితో పాటు నాకు కూడా మీ ఆశీస్సులు, మద్దతు తప్పనిసరిగా ఉండాలి. ఈ కార్యక్రమంలో, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, సర్పంచులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




