Hyderabad: పేపర్ లీకేజీలతో విద్యార్థుల కలలు చిన్నాభిన్నం.. కేంద్రంపై విమర్శలు
Hyderabad: నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం, ఎన్.టి.ఏ వైఫల్యాన్ని నిరసిస్తూ విద్యార్థి జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు మాసంపల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు.
Hyderabad: పేపర్ లీకేజీలతో విద్యార్థుల కలలు చిన్నాభిన్నం.. కేంద్రంపై విమర్శలు
Hyderabad: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీట్ పరీక్ష లక్షల మంది విద్యార్థుల కలలను చిన్నాభిన్నం చేస్తోందని, పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడంలో విఫలమవుతూ వరుస పేపర్ లీకేజీలకు కారణమవుతున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్.టి.ఏ) ను తక్షణమే రద్దు చేసి, పరీక్షల నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించాలని విద్యార్థి జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాసంపల్లి అరుణ్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ మేరకు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, మే 3న దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్షలో జరిగిన లీకేజీల కారణంగా రాత్రింబవళ్లు కష్టపడి చదివిన లక్షలాది మంది విద్యార్థుల శ్రమ వృథా అయిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో పరీక్షల నిర్వహణపై రాష్ట్రాల హక్కులను కేంద్ర ప్రభుత్వం హరించి, మొత్తం వ్యవస్థను ఎన్.టి.ఏ చేతుల్లో పెట్టడంతో పారదర్శకత పూర్తిగా దెబ్బతిందని, ఫలితంగా వరుసగా పేపర్ లీకేజీలు జరుగుతున్నాయని విమర్శించారు.
గతంలో 2024లో జరిగిన నీట్, నెట్ పరీక్షల పేపర్ లీకుల కారణంగా దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సంస్కరణలు చేపట్టకుండా మళ్లీ అదే నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తోందని అన్నారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. తక్షణమే నీట్ పేపర్ లీకేజీపై సమగ్ర న్యాయ విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లీకేజీల వల్ల నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్.టి.ఏ ను రద్దు చేసి, ప్రవేశ పరీక్షల నిర్వహణ అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.




