LB Nagar: ఖాకీలో మానవత్వం.. చంటి బిడ్డకు అమ్మలా అండగా నిలిచిన మహిళా కానిస్టేబుల్!
LB Nagar: పోక్సో కోర్టులో విధి నిర్వహణలో భాగంగా ఓ బాధితురాలి చంటి బిడ్డకు తల్లిలా ఆలనా పాలనా చూసి మానవత్వాన్ని చాటుకున్నారు చైతన్యపురి మహిళా కానిస్టేబుల్ దీప.
LB Nagar: ఖాకీలో మానవత్వం.. చంటి బిడ్డకు అమ్మలా అండగా నిలిచిన మహిళా కానిస్టేబుల్!
LB Nagar: పోలీసు యూనిఫాం వెనుక ఓ అమ్మ మనసు ఉందని నిరూపించారు మహిళా కానిస్టేబుల్ దీప. విధి నిర్వహణలో భాగంగా కోర్టుకు వచ్చిన ఓ పోక్సో బాధితురాలి చంటి బిడ్డకు తల్లిలా ఆలనా పాలనా చూసి మానవత్వాన్ని చాటుకున్నారు.
మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా కోర్టు కానిస్టేబుల్ దీప మంగళవారం ఎల్బీనగర్లోని రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టులో విధుల్లో ఉన్నారు. ఈ క్రమంలో ఓ పోక్సో కేసు విచారణకు బాధితురాలు తన చంటి బిడ్డతో కోర్టుకు హాజరయ్యారు.
కోర్టులో ఇన్‌కెమెరా విచారణ జరుగుతున్న సమయంలో బాధితురాలికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కానిస్టేబుల్ దీప చంటి బిడ్డ బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు. పసికందును చేతుల్లోకి తీసుకుని లాలిస్తూ, ఆడిస్తూ విచారణ పూర్తయ్యే వరకు తల్లిలా చూసుకున్నారు.
యూనిఫాంలో ఉన్నా.. అమ్మతనం మరువలేదు!
సాధారణంగా విధి నిర్వహణకే పరిమితం కాకుండా, బాధితురాలి పరిస్థితిని అర్థం చేసుకుని మానవీయంగా స్పందించిన దీప తీరుపై కోర్టు ఆవరణలో ఉన్న న్యాయవాదులు, పోలీసులు, సిబ్బంది ప్రశంసలు కురిపించారు.
పోలీసులంటే కేవలం చట్టాన్ని అమలు చేసేవారే కాదు.. ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచే మానవతావాదులని తన చర్యతో చాటిచెప్పారు దీప. ఈ ఘటనకు సంబంధించిన ఫొటో న్యాయవర్గాల్లో ప్రశంసలు అందుకుంటోంది.




