Hyderabad: బంజారా భవన్‌లో చేయూత పెన్షన్ మంజూరు పత్రాలు పంపిణీ చేసిన మంత్రులు!

Hyderabad: హైదరాబాద్ బంజారా భవన్‌లో గురువారం మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ చేయూత పెన్షన్ పత్రాలు పంపిణీ చేసి నవంబర్ 26 నుండి నగదు, ఇందిరమ్మ చీరలు ఇస్తామన్నారు.

RAJESH,	WEST ZONE
Published on: 19 Nov 2026 4:48 PM IST
Hyderabad
X

Hyderabad: బంజారా భవన్‌లో చేయూత పెన్షన్ మంజూరు పత్రాలు పంపిణీ చేసిన మంత్రులు!

హైదరాబాద్: మహిళల సంక్షేమం, ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి సీతక్క అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 4.63 లక్షల మందికి చేయూత పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందిస్తామని, ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని వారు కూడా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

బంజారాహిల్స్‌లోని బంజారా భవన్‌లో ఖైరతాబాద్ నియోజకవర్గ లబ్ధిదారులకు నూతన చేయూత పెన్షన్ మంజూరు పత్రాలను మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలిచేందుకే ప్రభుత్వం చేయూత పెన్షన్లు అందిస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు అప్పగించిన బాధ్యత మేరకు అర్హులైన పేద కుటుంబాలను ఆదుకుంటున్నామని తెలిపారు.

మహిళలు మహిళా సంఘాల్లో చేరి ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఒక్కో మహిళా సంఘానికి రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వ్యాపారాలు ప్రారంభించాలని సూచించారు. మహిళలు స్వయం ఉపాధి సాధించేలా ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తోందన్నారు.

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మహిళలకు స్ఫూర్తి అని, ఆమె పేరుతోనే ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. మహిళల పేరుతో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని, హైటెక్ సిటీ సమీపంలో రూ.వెయ్యి కోట్లతో ఇందిరా మహిళా శక్తి మార్కెట్‌ను మహిళా సంఘాలకు కేటాయించామని వెల్లడించారు.

ఈ నెల 26 నుంచి చేయూత పెన్షన్ నగదును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. అదే రోజు చిలకపచ్చ రంగులో ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయనున్నామని, రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు అందించడమే లక్ష్యమని ప్రకటించారు. ఖైరతాబాద్ నియోజకవర్గ మహిళలకు షాపులు ఏర్పాటు చేయించి, రుణాలు అందించి వ్యాపారాల్లో ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, కలెక్టర్ ప్రియాంక ఆల తదితరులు పాల్గొన్నారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE