Pocharam: యమ్నంపేటలో గంజాయి ముఠా గుట్టురట్టు: ఇద్దరు అరెస్ట్

Pocharam: పోచారం ఐటీ కారిడార్ యమ్నంపేట వద్ద ఉప్పల్ ఎస్వోటీ పోలీసులు 22 కిలోల గంజాయిని పట్టుకుని ఒడిశాకు చెందిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.

KARUNAKAR, UPPAL
Published on: 21 Sept 2026 3:54 PM IST
Pocharam
X

Pocharam: యమ్నంపేటలో గంజాయి ముఠా గుట్టురట్టు: ఇద్దరు అరెస్ట్

పోచారం: ఒడిశా నుంచి గోవాకు గంజాయిని తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును ఉప్పల్‌ జోన్‌ ఎస్‌వోటీ పోలీసులు రట్టు చేశారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా పోచారం ఐటీ కారిడార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని యమ్నంపేట పద్మనాభస్వామి ఆలయ ఆర్చ్‌ సమీపంలో సోమవారం మారుతి బలెనో కారును తనిఖీ చేయగా 22 కిలోల గంజాయి పట్టుబడింది. కారులో ఉన్న ఒడిశాకు చెందిన అనిల్‌కుమార్‌ గౌడ, అవినాష్‌ శర్మలను పోలీసులు అరెస్టు చేశారు.

విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్‌వోటీ పోలీసులు తనిఖీలు చేపట్టారు. కారులోని గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి 22 కిలోల గంజాయితో పాటు బలెనో కారు, రెండు సెల్‌ఫోన్లు, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.24 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనావేశారు. ఈ వ్యవహారంలో మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది.

అరెస్టయిన నిందితులను, స్వాధీనం చేసుకున్న గంజాయి, ఇతర వస్తువులను ఎస్‌వోటీ పోలీసులు పోచారం ఐటీ కారిడార్‌ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోచారం ఐటీ కారిడార్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? గోవాలో ఎవరికి తరలిస్తున్నారు? పరారీలో ఉన్న మరో ఇద్దరు ఎవరు? అనే కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL