Uppal: ఉప్పల్‌లో చైన్ స్నాచింగ్ కలకలం.. వెంటాడి పట్టుకున్న స్థానికులు!
Uppal: హైదరాబాద్ ఉప్పల్ పరిధిలోని హనుమాన్ సాయినగర్‌లో దారుణం జరిగింది.
Uppal: ఉప్పల్‌లో చైన్ స్నాచింగ్ కలకలం.. వెంటాడి పట్టుకున్న స్థానికులు!
ఉప్పల్: కస్టమర్ వేషంలో కాస్మెటిక్ షాప్‌లోకి ప్రవేశించిన ఓ యువకుడు మహిళ మెడలోని బంగారు మంగళసూత్రాన్ని లాక్కొని పరారయ్యేందుకు యత్నించిన ఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఉప్పల్ హనుమాన్ సాయినగర్‌లో జరిగింది. అప్రమత్తమైన స్థానికులు వెంటాడి నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
బాధితురాలు కసుల సంధ్య (35), రామంతాపూర్‌లోని వెంకటరెడ్డి నగర్‌కు చెందినది. ఆమె ఉప్పల్ హనుమాన్ సాయినగర్‌లో ఉన్న ఓ కాస్మెటిక్ షాప్‌లో పనిచేస్తోంది. గురువారం మధ్యాహ్నం సుమారు 12:50 గంటల సమయంలో ఓ యువకుడు కస్టమర్‌గా దుకాణంలోకి వచ్చి ఫేస్‌వాష్ ధర గురించి అడిగాడు.
సంధ్య వస్తువు చూపించేందుకు వెనక్కి తిరిగిన సమయంలో, అతడు ఆమె మెడలో ఉన్న సుమారు 37 గ్రాముల బంగారు మంగళసూత్రాన్ని బలవంతంగా లాక్కొని అక్కడి నుంచి పరుగులు తీశాడు.ఘటనతో షాక్‌కు గురైన సంధ్య వెంటనే బయటకు వచ్చి కేకలు వేస్తూ దుండగుడిని వెంబడించింది. ఇదే సమయంలో షాప్‌కు వచ్చిన ఓ కస్టమర్ అప్రమత్తమై పారిపోతున్న నిందితుడిని వెంటాడాడు.
ఉప్పల్ మండే మార్కెట్ ప్రాంతంలో అతడిని పట్టుకుని తిరిగి బాధితురాలి వద్దకు తీసుకొచ్చారు. అనంతరం స్థానికులు నిందితుడిని ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో నిందితుడిని బానోతు శ్రీనివాస్ (21)గా గుర్తించారు. ఇతడు కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం యాచారం గ్రామ పరిధిలోని సజ్జనాయక్ తండాకు చెందినవాడని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఎస్.ఆర్.నగర్‌లో ఉన్న ఓ హాస్టల్‌లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నట్లు వెల్లడించారు.
నిందితుడు స్నాచింగ్‌కు పాల్పడిన దృశ్యాలు షాప్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అతడి వద్ద నుంచి అపహరించిన బంగారు మంగళసూత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. స్థానికుల అప్రమత్తతతో నిందితుడు వెంటనే పోలీసుల చేతికి చిక్కడం అభినందనీయమని పోలీసులు పేర్కొన్నారు.




