Mahesh Kumar Goud: యువతే కాంగ్రెస్‌కు బలమైన శక్తి: టీపీసీసీ అధ్యక్షుడు!
Mahesh Kumar Goud: గాంధీభవన్‌లో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ భేటీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు.
Mahesh Kumar Goud: యువతే కాంగ్రెస్‌కు బలమైన శక్తి: టీపీసీసీ అధ్యక్షుడు!
Mahesh Kumar Goud: యువతే కాంగ్రెస్ పార్టీకి బలమైన శక్తి అని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. యువజన కాంగ్రెస్ నాయకులు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో యువజన కాంగ్రెస్ నాయకులు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
గాంధీభవన్‌లో యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జాతీయ యువజన కాంగ్రెస్ ఇంచార్జ్ మణిశర్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయా జిల్లాల్లో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలు, రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఇండియన్ యూత్ కాంగ్రెస్ (IYC) ఆధ్వర్యంలో కొనసాగుతున్న వివిధ కార్యక్రమాలతో పాటు పార్టీ సంస్థాగత అంశాలపై సమీక్ష నిర్వహించారు.
సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ నాయకులకు ప్రాధాన్యం కల్పించామని తెలిపారు. రాజకీయాల్లో రాణించాలంటే ఓపికతో పాటు కష్టపడే తత్వం ఎంతో అవసరమన్నారు. యువజన కాంగ్రెస్ ఒక చరిష్మాటిక్ ఆర్గనైజేషన్‌గా ఎదిగిందని, ఈ వేదిక నుంచి వచ్చిన అనేక మంది నాయకులు వివిధ కీలక పదవుల్లో కొనసాగుతున్నారని పేర్కొన్నారు.
యువజన కాంగ్రెస్ నుంచి ఎదిగిన నాయకులు అనేక రాష్ట్రాల్లో కీలక బాధ్యతలు చేపట్టారని, కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీశన్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వంటి నాయకులు యువజన కాంగ్రెస్ రాజకీయ ప్రస్థానంతో అనుబంధం కలిగి ఉన్నారని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
తాను ఎన్‌ఎస్‌యూఐ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించినందువల్లే పార్టీ సంస్థాగత బాధ్యతల్లో అవకాశాలు లభించాయని ఆయన గుర్తుచేశారు. యువజన కాంగ్రెస్‌లో పనిచేసే అవకాశం ఒక గొప్ప వరమని, దాన్ని సద్వినియోగం చేసుకుని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని యువ నాయకులకు సూచించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు చేరేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆయన కోరారు. యువజన కాంగ్రెస్ నాయకులు ప్రజల మధ్య నిరంతరం ఉంటూ వారి సమస్యలను గుర్తించి పరిష్కారం కోసం పోరాడాలని సూచించారు.
ఈ సమావేశంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జ్ సయ్యద్ ఖాలిద్ అహ్మద్, సహ ఇంచార్జులు భవ్య, రోషిణి జైస్వాల్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.




