Uppal: జర్మనీ నుంచి వచ్చిన రోజే రామంతాపూర్‌లో యువకుడి ఆత్మహత్య!

Uppal: జర్మనీ నుంచి వచ్చిన కొద్ది గంటల్లోనే యువకుడి బలవన్మరణం హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం బెడ్‌రూమ్‌లో ఉరేసుకుని విద్యాసాగర్ మృతి.. ఉప్పల్ పోలీసుల దర్యాప్తు.

KARUNAKAR, UPPAL
Published on: 3 Oct 2026 8:05 PM IST
Uppal
X

Uppal: జర్మనీ నుంచి వచ్చిన రోజే రామంతాపూర్‌లో యువకుడి ఆత్మహత్య!

ఉప్పల్‌: ఉద్యోగ నిమిత్తం జర్మనీలో ఉంటున్న యువకుడు మూడు నెలల తర్వాత హైదరాబాద్‌కు తిరిగొచ్చిన కొద్ది గంటల్లోనే ఇంట్లో మృతి చెందిన ఘటన ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రామంతాపూర్‌లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ రామంతాపూర్‌ బాలకృష్ణానగర్‌కు చెందిన వీరగాని మల్లేశంగౌడ్‌ (53)కు ఇద్దరు కుమారులు.

పెద్ద కుమారుడు విద్యాసాగర్‌ (29) గత మూడు నెలలుగా జర్మనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అక్టోబర్‌ 2న తెల్లవారుజామున సుమారు 3 గంటలకు విద్యాసాగర్‌ హైదరాబాద్‌కు చేరుకున్నాడు. తండ్రి మల్లేశంగౌడ్‌ అతడిని ఉప్పల్‌ రింగ్‌రోడ్డు వద్ద రిసీవ్‌ చేసుకుని రామంతాపూర్‌ బాలకృష్ణానగర్‌లోని ఇంట్లో దింపాడు. అనంతరం ఉదయం 6 గంటలకు మల్లేశంగౌడ్‌ ఓ కార్యక్రమం నిమిత్తం స్వగ్రామానికి వెళ్లారు. ఆ సమయంలో చిన్న కుమారుడు ప్రేమ్‌సాగర్‌, కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్నారు.

మధ్యాహ్నం 3 గంటలకు నిద్రలేచిన ప్రేమ్‌సాగర్‌ తన అన్న విద్యాసాగర్‌కు ఫోన్‌ చేశాడు. అయితే ఫోన్‌ ఎత్తకపోవడంతోపాటు బెడ్‌రూమ్‌ తలుపు తట్టినా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో అన్న నిద్రపోతున్నాడని భావించి అతడిని ఇబ్బంది పెట్టకుండా ఉండిపోయాడు. రాత్రి 8 గంటలకు స్వగ్రామం నుంచి ఇంటికి వచ్చిన మల్లేశంగౌడ్‌ కూడా కుమారుడి కోసం చూశారు.

విద్యాసాగర్‌ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో బెడ్‌రూమ్‌ కిటికీలో నుంచి చూశారు. రాత్రి 8.10 గంటల సమయంలో విద్యాసాగర్‌ లోపల కనిపించాడు. అతడి వద్ద రెండు సెల్‌ఫోన్లు ఉండటంతోపాటు చెవుల్లో ఇయర్‌బడ్స్‌ ఉన్నాయి. తొలుత ఫోన్‌లో మాట్లాడుతున్నాడని కుటుంబసభ్యులు భావించారు. అనంతరం పరిశీలించగా విద్యుత్‌ తీగతో ఉరేసుకుని మృతి చెందినట్లు గుర్తించారు.

ఈ ఘటనపై తండ్రి మల్లేశంగౌడ్‌ ఉప్పల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకుడి మృతికి గల కారణాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL