Uppal: ఉప్పల్ స్కైవాక్ లిఫ్ట్‌లో రెండు గంటలకు పైగా చిక్కుకున్న యువకుడు

Uppal: ఉప్పల్ స్కైవాక్ లిఫ్ట్ సాంకేతిక లోపంతో మొరాయించడంతో రాహుల్ అనే యువకుడు 2 గంటల పాటు అందులోనే చిక్కుకుపోయాడు.

KARUNAKAR, UPPAL
Published on: 12 Jun 2026 8:20 AM IST
Uppal
X

Uppal: ఉప్పల్ స్కైవాక్ లిఫ్ట్‌లో రెండు గంటలకు పైగా చిక్కుకున్న యువకుడు

ఉప్పల్: ఉప్పల్ స్కైవాక్ లిఫ్ట్‌లో ఓ యువకుడు చిక్కుకుపోయిన ఘటన గురువారం రాత్రి తీవ్ర ఆందోళనకు దారితీసింది. మహబూబ్‌నగర్‌కు చెందిన రాహుల్ (20) ఉప్పల్‌లోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర బాయ్స్ హాస్టల్‌లో ఉంటూ ఎన్‌ఆర్‌పీలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. డ్యూటీ ముగించుకుని హాస్టల్‌ కు వెళ్తున్న సమయంలో ఉప్పల్ మెట్రో స్టేషన్ నుండి బయటకు వచ్చి రాత్రి సుమారు 11 గంటలకు 6-బీ స్కైవాక్ లిఫ్ట్ ఎక్కి కిందకు దిగుతుండగా లిఫ్ట్ అకస్మాత్తుగా మధ్యలోనే ఆగిపోయింది.

దీంతో రాహుల్ లిఫ్ట్‌ లోనే చిక్కుకుపోయి తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. సమాచారం అందుకున్న హైడ్రా అధికారులు, ఉప్పల్ పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే లిఫ్ట్ తలుపులు తెరుచుకోకపోవడంతో యువకుడిని బయటకు తీసేందుకు ఆలస్యం జరిగింది. దాదాపు రెండు గంటల పాటు లిఫ్ట్‌లో ఉన్న రాహుల్‌ను టెక్నీషియన్ సహాయంతో రాత్రి 1:15 గంటల సమయంలో సురక్షితంగా బయటకు తీశారు.

లిఫ్ట్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న కృష్ణా కన్‌స్ట్రక్షన్ సిబ్బంది, హెచ్‌ఎండీఏ అధికారుల నుంచి సకాలంలో స్పందన లేకపోవడంతోనే సహాయక చర్యల్లో ఆలస్యం జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెయింటెనెన్స్ లోపాల కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లిఫ్ట్ నుంచి బయటకు వచ్చిన అనంతరం రాహుల్ మాట్లాడుతూ.. “నేను హార్ట్ పేషెంట్‌ను. లిఫ్ట్‌లో ఇంతసేపు ఉండటం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురయ్యాను.

నిర్వహణ సంస్థ నుంచి సరైన సమయంలో స్పందన రాకపోవడంతో ఆలస్యం జరిగింది” అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలోనూ స్కైవాక్ లిఫ్ట్‌లలో ఇలాంటి సమస్యలు తలెత్తినప్పటికీ అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. లిఫ్ట్‌ల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story