ఉక్రెయిన్ పోర్టులో చిక్కుకున్న 13 మంది భారతీయ నావికులు

ఉక్రెయిన్‌లోని చోర్నోమోర్స్‌క్ పోర్టులో 13 మంది భారతీయ నావికులు చిక్కుకున్నారు. డ్రోన్, క్షిపణి దాడుల మధ్య వారిని వెంటనే తరలించాలని ఎఫ్‌ఎస్‌యూఐ విజ్ఞప్తి చేసింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 29 July 2026 2:40 AM IST
13 Indian Seafarers Trapped at Ukraine Port Amid Attacks
X

13 Indian Seafarers Trapped at Ukraine Port Amid Attacks

ఉక్రెయిన్‌లోని చోర్నోమోర్స్‌క్ (Chornomorsk) పోర్టులో నిలిపి ఉంచిన ఎంవీ అమీర్1 (MV Amir1) నౌకలో చిక్కుకున్న 13 మంది భారతీయ నావికుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. నౌకలో మొత్తం 15 మంది సిబ్బంది ఉండగా, డ్రోన్‌లు, క్షిపణి దాడులు జరుగుతున్న ప్రాంతంలో వారు ప్రాణభయంతో గడుపుతున్నారని ఫార్వర్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (FSUI) వెల్లడించింది.

తక్షణమే స్వదేశానికి తరలించాలని విజ్ఞప్తి

నౌక చుట్టుపక్కల ప్రాంతాల్లో తరచూ డ్రోన్, క్షిపణి దాడులు జరుగుతున్నాయని, ఎప్పుడైనా నౌకపై నేరుగా దాడి జరిగే ప్రమాదం ఉందని ఎఫ్‌ఎస్‌యూఐ పేర్కొంది. దీంతో నౌక యాజమాన్యం, సంబంధిత దేశ అధికారులు, భారత ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని నావికుల భద్రతను కల్పించి, వారిని స్వదేశానికి తరలించే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేసింది.

ఘర్షణ ప్రాంతాల్లో భారతీయ నావికులు లక్ష్యంగా మారొద్దు

"యుద్ధ ప్రాంతాల్లో భారతీయ నావికులను ప్రమాదంలో వదిలేయకూడదు. వారి భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి" అని ఎఫ్‌ఎస్‌యూఐ తన ప్రకటనలో పేర్కొంది.

ఒడెస్సా ఘటన తర్వాత మరో ఆందోళన

ఇటీవల ఉక్రెయిన్‌లోని ఒడెస్సా పోర్టులో వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో నలుగురు భారతీయ నావికులు ఉండగా, వారిలో ఇద్దరు అదృశ్యమైన విషయం తెలిసిందే. వారి కోసం స్థానిక అధికారులతో కలిసి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

భారత్‌ స్పందన

విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, అదృశ్యమైన భారతీయ నావికుల కోసం అన్వేషణ కొనసాగుతోందని, వారి కుటుంబాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. నావికుల భద్రత కోసం భారత్ అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు.

వాణిజ్య నౌకలపై దాడులు ఆగాలి

రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి చర్చలు, దౌత్య మార్గంలోనే పరిష్కారం లభించాలని భారత్ మరోసారి స్పష్టం చేసింది. వాణిజ్య నౌకలు, నావికులు, పౌరులు, పౌర మౌలిక సదుపాయాలపై ఎలాంటి దాడులు జరగకూడదని అన్ని పక్షాలకు భారత్ విజ్ఞప్తి చేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్‌లోని హార్ముజ్ జలసంధికి పశ్చిమంగా ఆరు భారతీయ నౌకలు ఉండగా, వాటిలో 125 మంది భారతీయ నావికులు విధులు నిర్వహిస్తున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story