3,800-Year-Old Letter: 3,800 ఏళ్ల క్రితమే అప్పుల బాధలు.. పురాతన లేఖలో బయటపడ్డ ఆసక్తికర విషయం
3,800 ఏళ్ల క్రితం అప్పు వసూలు చేయలేక ఓ మహిళ తన భర్తకు రాసిన లేఖను పరిశోధకులు మట్టి కవరు తెరవకుండానే చదివారు.
3,800-Year-Old Letter: అప్పు ఇచ్చిన డబ్బులు తిరిగి వసూలు చేసుకోవడం ఇప్పటికీ చాలామందికి పెద్ద సమస్యే. అప్పు తీసుకున్నవారు మాట మార్చడం, డబ్బులు ఇవ్వకుండా తప్పించుకోవడం వంటి ఘటనలు మనకు కొత్తేమీ కాదు. అయితే ఇలాంటి సమస్య దాదాపు 3,800 ఏళ్ల క్రితం కూడా ఉండేదని చెబితే ఆశ్చర్యం కలగకమానదు. అప్పు తీసుకున్న వ్యక్తి వెండి తిరిగి ఇవ్వడానికి నిరాకరించడంతో ఓ మహిళ తన భర్తకు లేఖ రాసింది. ఇన్నేళ్లుగా మట్టి కవరు లోపలే భద్రంగా ఉన్న ఆ లేఖను పురావస్తు శాస్త్రవేత్తలు తాజాగా ఎలాంటి నష్టం కలగకుండా చదవగలిగారు. ఈ పరిశోధన ఇప్పుడు చరిత్రకారుల దృష్టిని ఆకర్షిస్తోంది.
అప్పు వసూలు చేయలేక భర్తకు లేఖ
ఈ కథ దాదాపు 4,000 ఏళ్ల క్రితం నాటి అనటోలియా ప్రాంతానికి చెందినది. ప్రస్తుత టర్కియేలోని కుల్టెపే (Kültepe) అనే పురాతన ప్రాంతంలో అన్నా-అన్నా అనే మహిళ నివసించేది. ఆమె భర్త ఎన్నుమ్-అష్షూర్ వ్యాపారి. వ్యాపార పనుల కోసం ఆయన వివిధ నగరాలకు ప్రయాణించేవాడు. ఒకసారి తనకు రావాల్సిన వెండిని మరో వ్యాపారి లకేపుమ్ నుంచి తీసుకురావాలని భార్యకు చెప్పాడు. అయితే ఆమె వెళ్లి అడిగినప్పుడు లకేపుమ్ డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించాడు. తన భర్త తిరిగి వచ్చిన తర్వాత నేరుగా అతనికే వెండి చెల్లిస్తానని చెప్పాడు. అంతేకాదు, ఆ వెండిని ఇప్పటికే కుడాటుమ్ అనే మరో వ్యక్తికి ఇచ్చినట్లు కూడా పేర్కొన్నాడు. దీంతో అన్నా-అన్నా అసహనానికి గురైంది. జరిగిన విషయాన్ని వివరిస్తూ తన భర్తకు లేఖ రాసింది. ఈ లేఖలోని వివరాలు అప్పటి వ్యాపార సంబంధాలు, కుటుంబ జీవితం, ఆర్థిక లావాదేవీల గురించి ఆసక్తికరమైన సమాచారాన్ని అందిస్తున్నాయి.
కవరు పగలగొట్టకుండానే లేఖను చదివారు
ఈ మట్టి పలక కుల్టెపేలో జరిగిన తవ్వకాల సమయంలో బయటపడింది. ప్రస్తుతం ఇది టర్కియే రాజధాని అంకారాలోని మ్యూజియం ఆఫ్ అనటోలియన్ సివిలైజేషన్స్‌లో భద్రపరిచారు. లేఖ పంపిన మహిళ, అందుకోవాల్సిన వ్యక్తి పేర్లు మట్టి కవరుపై ఉన్నప్పటికీ, లోపల రాసిన సందేశాన్ని మాత్రం చదవడం సాధ్యం కాలేదు. ఎందుకంటే ఆ లేఖను మరో పొర మట్టితో పూర్తిగా మూసివేశారు. సాధారణంగా ఇలాంటి వస్తువులను తెరిచి పరిశీలిస్తే వాటికి నష్టం కలిగే ప్రమాదం ఉంటుంది. అందుకే జర్మనీలోని హాంబర్గ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ప్రత్యేక సాంకేతికతను ఉపయోగించారు. ENCI (Extracting Non-destructively Cuneiform Inscriptions) అనే మొబైల్ కంప్యూటెడ్ టోమోగ్రఫీ స్కానర్ సాయంతో కవరును తెరవకుండానే లోపలి భాగాన్ని పరిశీలించారు.
ఎక్స్‌రే సాంకేతికతతో వెలుగులోకి చరిత్ర
ఈ పరికరం ఎక్స్‌రే కిరణాల ద్వారా మట్టి కవరు లోపలి నిర్మాణాన్ని త్రిమితీయ చిత్రాలుగా రూపొందిస్తుంది. వాటిని కంప్యూటర్ సాయంతో విశ్లేషించి, లోపల ఉన్న కీలకమైన లిఖితాలను గుర్తించవచ్చు. ఈ విధంగా వేల ఏళ్లుగా చదవని లేఖలోని సందేశాన్ని పరిశోధకులు వెలికితీశారు. పురాతన మెసపొటేమియా ప్రాంతంలో సందేశాలను మట్టి పలకలపై కీలలిపి (Cuneiform) పద్ధతిలో రాసేవారు. వాటిని రక్షించేందుకు మరో మట్టి పొరతో కప్పి, పంపినవారి, అందుకోవాల్సినవారి వివరాలు, ముద్రలు వేయడం ఆనవాయితీగా ఉండేది. ఈ సాంకేతికతను మట్టి పలకలకే పరిమితం చేయకుండా ఇతర పురావస్తు వస్తువుల పరిశీలనలోనూ ఉపయోగించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. తొమ్మిదో శతాబ్దానికి చెందిన జార్జియన్ గ్రంథం, ఈజిప్టు విగ్రహాలు, మెసపొటేమియా ముద్రలపై కూడా ఇలాంటి పరిశీలనలు నిర్వహించారు. అయితే, ఈ లేఖ ఎన్నుమ్-అష్షూర్‌కు నిజంగా చేరిందా లేదా అన్నది మాత్రం తెలియదు. ఒకవేళ చేరకపోతే, తన భార్య రాసిన ఫిర్యాదు గురించి ఆయనకు ఎప్పటికీ తెలిసి ఉండకపోవచ్చు. కానీ దాదాపు 3,800 ఏళ్ల తర్వాత ఆ సందేశం బయటపడటం విశేషం. కాలం మారినా అప్పులు, ఆర్థిక లావాదేవీల చుట్టూ మనుషులు ఎదుర్కొనే సమస్యలు మాత్రం పెద్దగా మారలేదని ఈ చిన్న లేఖ గుర్తుచేస్తోంది.




