Pakistan Airstrike : 400 మంది మృతి.. 250 మందికి పైగా గాయాలు.. ఆసుపత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడి
Pakistan Airstrike : కాబూల్‌లోని ఆసుపత్రిపై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడిలో 400 మంది మృతి చెందగా, 250 మంది గాయపడ్డారు. ఈ దారుణాన్ని తాలిబన్లు యుద్ధ నేరంగా అభివర్ణించగా, పాక్ ఆ ఆరోపణలను తిరస్కరించింది.
Pakistan Airstrike
Pakistan Airstrike : అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పాకిస్థాన్ సైన్యం జరిపిన భారీ వైమానిక దాడుల్లో ఒక డ్రగ్ పునరావాస కేంద్రం (ఆసుపత్రి) పూర్తిగా ధ్వంసమైంది. ఈ భీకర దాడిలో దాదాపు 400 మంది మరణించగా, మరో 250 మంది తీవ్రంగా గాయపడినట్లు తాలిబన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో కాబూల్‌లోని 9వ పోలీస్ డిస్ట్రిక్ట్ పరిధిలో ఉన్న ఈ ఆసుపత్రిపై పాక్ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. మృతుల్లో ఎక్కువ మంది చికిత్స పొందుతున్న బాధితులే ఉన్నారని సమాచారం. ఈ ఘటనతో కాబూల్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
తాలిబన్ల తీవ్ర ఆగ్రహం
ఈ దారుణాన్ని తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ తీవ్రంగా ఖండించారు. పాకిస్థాన్ అఫ్గాన్ గగనతలాన్ని ఉల్లంఘించడమే కాకుండా, అమాయకులు ఉన్న ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకోవడం మానవత్వానికి వ్యతిరేకమని, ఇది ముమ్మాటికీ యుద్ధ నేరమని ఆయన మండిపడ్డారు. ఆసుపత్రిలో ఒక పెద్ద భాగం పూర్తిగా శిథిలాల కుప్పగా మారిందని, శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకున్నారని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడు వారాలుగా ఇరు దేశాల మధ్య జరుగుతున్న పోరాటంలో ఇది అత్యంత ఘోరమైన ఘటనగా పేర్కొన్నారు.
పాకిస్థాన్ వాదన
అయితే, తాలిబన్ల ఆరోపణలను పాకిస్థాన్ ప్రభుత్వం తోసిపుచ్చింది. తాము ఎటువంటి ఆసుపత్రిపై దాడి చేయలేదని, తమ లక్ష్యం కేవలం తాలిబన్ల సైనిక స్థావరాలు, ఉగ్రవాద మౌలిక సదుపాయాలు మాత్రమేనని పాక్ సమాచార మంత్రిత్వ శాఖ తెలిపింది. అఫ్గాన్ భూభాగం నుంచి పాకిస్థాన్ పౌరులపై దాడులు జరుగుతున్నాయని, అందుకే తాము కేవలం టెక్నికల్ ఎక్విప్‌మెంట్, మందుగుండు సామాగ్రి నిల్వ ఉన్న ప్రాంతాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని బుకాయిస్తోంది. తాలిబన్ల ప్రకటన ప్రజలను రెచ్చగొట్టేలా ఉందని పాక్ విమర్శించింది.
ముదురుతున్న సరిహద్దు వివాదం
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య గత మూడు వారాలుగా సరిహద్దు వద్ద తీవ్ర యుద్ధ వాతావరణం నెలకొంది. సరిహద్దుల్లో కాల్పులు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. అఫ్గాన్ ప్రభుత్వం డ్రోన్లను వాడి తమ పౌరులను గాయపరిచిందని, తాము రెడ్ లైన్ దాటకూడదని హెచ్చరిస్తూనే ఈ దాడులకు దిగిందని పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ పేర్కొన్నారు. మరోవైపు, అఫ్గాన్ ఉప ప్రధాని అబ్దుల్ సలామ్ హనఫీ స్పందిస్తూ.. తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం తమ ధర్మమని, పాక్ దాడుల వల్ల అమాయక పౌరులు బలవ్వడం విచారకరమని అన్నారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఈ ఉద్రిక్తతలు ఎటు దారితీస్తాయోనని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.




