Gene Editing : ఏకంగా రూ.7 కోట్ల చికిత్స.. బిలియన్ల కొద్దీ వైరస్లను పంపి చిన్నారి ప్రాణాలు తీసిన శాస్త్రవేత్తలు

Gene Editing : చైనాలో జీన్ ఎడిటింగ్ చికిత్స వికటించి ఆరేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. రూ. 7 కోట్లకు పైగా ఖర్చు చేసినా ఫలితం లేకపోవడంతో జీన్ ఎడిటింగ్ వైద్య ప్రయోగాల భద్రతపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

CR Reddy
Published on: 27 July 2026 6:15 AM IST
Gene Editing
X

 Gene Editing

Gene Editing : వైజ్ఞానిక ప్రపంచంలో జీన్ ఎడిటింగ్ టెక్నాలజీని భవిష్యత్తులోనే అత్యంత పెద్ద వైద్య విప్లవంగా భావిస్తున్నారు. మానవ డిఎన్ఏలో ఉన్న లోపాలను సరిదిద్దడం ద్వారా తీవ్రమైన జన్యుపరమైన వ్యాధులను శాశ్వతంగా నయం చేయవచ్చని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు. అయితే చైనాలో చోటుచేసుకున్న ఒక దిగ్భ్రాంతికర ఘటన ఈ సాంకేతికత భద్రత, నైతిక నియమాలపై పెద్ద ప్రశ్నలను లేవనెత్తుతోంది. అక్కడ ఆరేళ్ల చిన్నారిపై చేసిన ప్రయోగశాల జీన్ ఎడిటింగ్ చికిత్స వికటించి ఆమె మరణించింది. ఈ అరుదైన చికిత్స కోసం చిన్నారి కుటుంబం ఏకంగా 8 లక్షల డాలర్లు (భారతీయ కరెన్సీలో రూ.7 కోట్లకు పైగా) ఖర్చు చేయడం గమనార్హం.

చికిత్స ఎలా చేశారు? ఏం జరిగింది?

నివేదికల ప్రకారం.. ఆ చిన్నారి ఒక అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధి ఆమె మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపింది. ఆమెను నయం చేయడానికి శాస్త్రవేత్తలు బ్రెయిన్ కణాలలో ఉన్న లోపభూయిష్ట జన్యువులను మార్చేందుకు ఒక ప్రత్యేక జీన్ థెరపీని అభివృద్ధి చేశారు. ఈ చికిత్సలో భాగంగా వెన్నుపాము ద్వారా బిలియన్ల కొద్దీ వైరస్ ఆధారిత వెక్టర్లను చిన్నారి శరీరంలోకి పంపించారు. ఇవి మెదడుకు చేరుకుని DNA లోని లోపభూయిష్ట జన్యువులలో మార్పులు చేయాల్సి ఉంది. కానీ ఈ ప్రయోగం జరిగిన కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయింది.

రహస్యంగా ఉంచేందుకు యత్నం

ఈ ఘటన వైద్య రంగంలో తీవ్ర ఆందోళన రేకెత్తించడానికి మరో కారణం ఉంది. చిన్నారి మృతి చెందిన విషయాన్ని ఆసుపత్రి యాజమాన్యం ప్రాథమికంగా బయటకు పొక్కకుండా రహస్యంగా ఉంచేందుకు ప్రయత్నించింది. అనంతరం దర్యాప్తు నివేదికల ద్వారా ఈ చేదు నిజం వెలుగులోకి వచ్చింది. వివాదం ముదిరిపోవడంతో సంబంధిత వైద్య సంస్థ ఈ ఘటనపై సమగ్ర విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. కొత్త వైద్య సాంకేతికతలలో పరిశోధనలు, ప్రయోగాలు అవసరమే అయినప్పటికీ, ముఖ్యంగా చిన్న పిల్లలపై ఇలాంటి ప్రయోగాలు చేసేటప్పుడు భద్రత, ప్రమాదాల ముందస్తు హెచ్చరికలు, నైతిక నియమాలను పాటించడం అత్యంత ముఖ్యమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ప్రపంచ దేశాలకు హెచ్చరిక

జీన్ ఎడిటింగ్ విషయంలో చైనా వివాదాల్లోకి చిక్కుకోవడం ఇది మొదటిసారి కాదు. గతంలో 2018 సంవత్సరంలో కూడా చైనా శాస్త్రవేత్త హే జియాన్‌కుయ్ జన్యు మార్పిడి చేసిన కవల పిల్లలను సృష్టించినట్లు ప్రకటించి ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపారు. ఆ సమయంలో కూడా శాస్త్రీయ ప్రపంచం భద్రత, నైతికతపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. మానవ కణాల పనితీరు సమాచారం అంతా DNA లోనే ఉంటుంది. దానిలో మార్పులు చేసే ఈ జీన్ ఎడిటింగ్ ప్రాణాపాయానికి దారితీస్తుందనేది ఈ ఘటనతో మరోసారి రుజువైంది. భవిష్యత్తులో అత్యంత కఠినమైన నిబంధనలు అమలు చేయకపోతే ఇలాంటి దురదృష్టకర సంఘటనలు పునరావృతమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story