Pakistan: పాకిస్థాన్‌లో ఘోరం: రోడ్డు పక్కన ఐఈడీ బాంబుల పేలుడు.. ఏడుగురు మృతి!
Pakistan: పాకిస్థాన్‌లోని ఖైబర్ ఫుక్తునక్వా ప్రావిన్స్ బన్నూ జిల్లాలో జరిగిన భయంకరమైన ఐఈడీ బాంబు పేలుళ్లలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
Pakistan: పాకిస్థాన్‌లో ఘోరం: రోడ్డు పక్కన ఐఈడీ బాంబుల పేలుడు.. ఏడుగురు మృతి!
Pakistan: పాకిస్థాన్‌లోని ఖైబర్ ఫుక్తునక్వా ప్రావిన్సులో ఘోర బాంబు పేలుళ్ల ఘటన చోటుచేసుకుంది. బన్నూ జిల్లాలోని మర్కా బేరే ఏరియాలో రోడ్డు పక్కన ఉగ్రవాదులు నాటిన ఐఈడీ (IED) బాంబులు తృటిలో పేలడంతో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
బన్నూ జిల్లా పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. హాథీ కేల్ గ్రామం నుంచి బన్నూ సిటీకి ప్రయాణికులతో వెళ్తున్న ఒక వ్యాన్‌ను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు రోడ్డుపై ఐఈడీ బాంబును అమర్చారు. ఆ వ్యాన్ సదరు ప్రాంతాన్ని దాటుతున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘోర ప్రమాదంలో వ్యాన్ లోపల ప్రయాణిస్తున్న వారిలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మొదటి పేలుడు జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టేందుకు ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ మిషన్‌కు చెందిన మరో వాహనం కూడా ఉగ్రవాదుల కుట్రకు బలైంది. అక్కడ అమర్చిన మరో ఐఈడీ బాంబు పేలడంతో రెస్క్యూ వాహనంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య ఏడుకు చేరింది. ఘటనా స్థలంలో క్షతగాత్రులైన ముగ్గురిని రెస్క్యూ సిబ్బంది స్థానిక ఆసుపత్రికి తరలించారు.
ఈ దాడుల అనంతరం అప్రమత్తమైన పాక్ సెక్యూర్టీ దళాలు, పోలీసులు ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని చుట్టుముట్టారు. బ్లాస్ట్ సైట్ నుంచి బాంబు స్క్వాడ్ ఆధారాలను సేకరించింది. కాగా, ఈ పేలుళ్లకు సంబంధించి ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా అధికారికంగా బాధ్యత ప్రకటించలేదు. ఖైబర్ ఫుక్తునక్వా సీఎం సోహేల్ అఫ్రిదీ ఈ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.




