Israel Threat to World Peace: ఇజ్రాయెల్‌పై బ్రిటన్ ప్రజల సంచలన సర్వే...78శాతం మంది నెతన్యాహుకు వ్యతిరేకం

బ్రిటన్‌లో నిర్వహించిన NatCen సర్వేలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. 78 శాతం మంది ఇజ్రాయెల్‌ను ప్రపంచ శాంతికి తీవ్రమైన ముప్పుగా భావిస్తున్నారు. అమెరికా, రష్యా, ఇరాన్‌లపై బ్రిటన్ ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Rudrachander
Published on: 10 Nov 2026 2:39 PM IST
Israel Threat to World Peace: ఇజ్రాయెల్‌పై బ్రిటన్ ప్రజల సంచలన సర్వే...78శాతం మంది నెతన్యాహుకు వ్యతిరేకం
X

Israel Threat to World Peace: ఇజ్రాయెల్‌పై బ్రిటన్ ప్రజల అభిప్రాయంలో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధాలు, గాజాపై ఇజ్రాయెల్ సైనిక చర్యలు, ఇరాన్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశంపై బ్రిటన్ ప్రజల్లో ఆందోళన పెరిగినట్లు తాజా సర్వే వెల్లడించింది. బ్రిటన్‌కు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ సోషల్ రీసెర్చ్ (NatCen) నిర్వహించిన బ్రిటిష్ సోషల్ యాటిట్యూడ్స్ సర్వే ప్రకారం.. ఏకంగా 78 శాతం మంది ఇజ్రాయెల్‌ను ప్రపంచ శాంతికి తీవ్రమైన ముప్పుగా భావిస్తున్నారు. 2005లో ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినవారు 48 శాతం మాత్రమే. అంటే రెండు దశాబ్దాల్లో ప్రజల ఆలోచనలో స్పష్టమైన మార్పు వచ్చింది.

ప్రపంచ దేశాలపై బ్రిటన్ ప్రజల అభిప్రాయం ఇదీ!

ఈ సర్వేలో ప్రపంచ శాంతికి ముప్పుగా భావిస్తున్న దేశాల విషయంలో కూడా ఆసక్తికరమైన గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. రష్యా 89 శాతంతో మొదటి స్థానంలో ఉండగా, ఇజ్రాయెల్ 78 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. ఇరాన్‌ను 75 శాతం మంది, అమెరికాను 74 శాతం మంది ప్రమాదకర దేశాలుగా అభిప్రాయపడ్డారు. ఉత్తర కొరియాను 66 శాతం మంది, చైనాను 62 శాతం మంది ప్రపంచ శాంతికి ముప్పుగా చూశారు. సౌదీ అరేబియాపై ఈ అభిప్రాయం వ్యక్తం చేసినవారు 34 శాతం మాత్రమే. ఈ గణాంకాలను పరిశీలిస్తే ఇజ్రాయెల్‌పై ఆందోళన రష్యా తర్వాతి స్థాయిలో ఉందని అర్థమవుతోంది.

గాజా యుద్ధం తర్వాత మారిన అభిప్రాయం

ఇజ్రాయెల్‌పై ప్రజల్లో ఈ మార్పునకు మధ్యప్రాచ్య పరిణామాలు ప్రధాన కారణమని NatCen విశ్లేషించింది. 2023 అక్టోబర్ 7న హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్ గాజాపై సైనిక చర్యలు ప్రారంభించింది. ఈ పరిణామాలతో గాజాలో భారీ విధ్వంసం జరిగింది. 2024 శరదృతువు నాటికి ఇజ్రాయెల్‌ను ప్రపంచ శాంతికి ముప్పుగా భావించిన బ్రిటన్ ప్రజల సంఖ్య దాదాపు 73 శాతానికి చేరింది. ఆ తర్వాత కొంత తగ్గినప్పటికీ, 2026 వసంతకాలంలో ఇరాన్‌పై జరిగిన బాంబు దాడుల నేపథ్యంలో మళ్లీ 78 శాతానికి పెరిగింది. అయితే బ్రిటన్ ప్రజల ఆందోళన కేవలం ఇజ్రాయెల్ చర్యలకే పరిమితం కాకపోవచ్చని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ఇజ్రాయెల్‌కు సంబంధించిన పరిణామాలు మొత్తం మధ్యప్రాచ్య ప్రాంతంలో పెద్ద యుద్ధానికి దారితీస్తాయనే భయం కూడా దీనికి కారణమై ఉండవచ్చని వివరించారు.

అమెరికాపైనా పెరుగుతున్న వ్యతిరేక అభిప్రాయం?

ఈ సర్వేలో మరో ముఖ్యమైన విషయం అమెరికాకు సంబంధించినది. 2024లో అమెరికాను ప్రపంచ శాంతికి ముప్పుగా భావించినవారు 35 శాతం ఉండగా, 2026 నాటికి ఆ సంఖ్య 74 శాతానికి చేరింది. అంటే కేవలం రెండేళ్లలో రెట్టింపుకంటే ఎక్కువ పెరుగుదల నమోదైంది. రష్యా, ఇజ్రాయెల్, ఇరాన్‌లతో పాటు అమెరికాపై కూడా బ్రిటన్ ప్రజల్లో ఆందోళన పెరుగుతున్నట్లు ఈ గణాంకాలు చెబుతున్నాయి.

యువతలో భిన్నమైన ఆలోచన

వయసు, రాజకీయ అభిప్రాయాలను బట్టి కూడా ప్రజల స్పందనలో తేడాలున్నాయి. ముఖ్యంగా యువత ఇజ్రాయెల్, అమెరికాలను ప్రపంచ శాంతికి ముప్పుగా ఎక్కువగా భావిస్తున్నారు. మరోవైపు వృద్ధులు రష్యా, చైనా, ఉత్తర కొరియా, ఇరాన్‌లను ప్రధాన భద్రతా సమస్యలుగా చూస్తున్నారు. గ్రీన్ పార్టీ మద్దతుదారులు ఇజ్రాయెల్, అమెరికాల విషయంలో ఎక్కువ ఆందోళన వ్యక్తం చేయగా, రిఫార్మ్ పార్టీ మద్దతుదారులు చైనా, ఉత్తర కొరియా, ఇరాన్‌లను ఎక్కువగా ప్రమాదకర దేశాలుగా పరిగణిస్తున్నారు

Rudrachander

Rudrachander

రుద్ర చందర్‌ తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు