Carol Ruckdeschel: ఒంటరి ద్వీపంలో 84 ఏళ్ల వృద్ధురాలి సాహసం... వందలాది పాములతో పోరాటం
ప్రపంచానికి దూరంగా ఒంటరి ద్వీపంలో పర్యావరణ పరిరక్షణ కోసం కరోల్ రక్‌డెషెల్ చేస్తున్న పోరాటం స్పూర్తిదాయకం. దేని గురించి, ఎవరిపై పోరాటం చేస్తున్నదో తెలుసుకుందాం.
Carol Ruckdeschel: బాహ్య ప్రపంచానికి, ఆధునిక సౌకర్యాలకు దూరంగా ఒక ఒంటరి ద్వీపంలో 84 ఏళ్ల వృద్ధురాలు నివసించడం అంటేనే అదొక పెద్ద సాహసం. అయితే, ఆమె అక్కడ కేవలం వన్యప్రాణులతోనో, పాములతోనో పోరాడుతూ కాలం వెళ్లదీయడం లేదు. అంతకుమించి ఆ ద్వీప పర్యావరణాన్ని కాపాడటానికి ప్రభుత్వ విధానాలపైనే నేరుగా యుద్ధం చేస్తోంది. అమెరికాలోని జార్జియా తీరంలో ఉన్న కంబర్లాండ్ ద్వీపంలో గత 53 ఏళ్లుగా ఒంటరిగా జీవిస్తున్న పర్యావరణ శాస్త్రవేత్త కరోల్ రక్‌డెషెల్ కథ ఇది. ఆమె జీవనశైలి కారణంగా ఆమెను 'అమెరికాస్ వైల్డెస్ట్ ఉమెన్' అని, తాబేళ్లపై ఆమె చేసిన పరిశోధనలకు గాను 'సీ టర్టిల్స్ జేన్ గుడాల్' అని పిలుస్తారు. ఈమె కథ చదివితే కన్నీళ్లు వస్తాయి. ఆమె చేస్తున్న పోరాటాన్ని చప్పట్లతో మనస్ఫూర్తిగా అంగీకరిస్తాం.
తాబేళ్ల కోసం అంతర్జాతీయ స్థాయి పరిశోధన
దాదాపు 36,000 ఎకరాల వైశాల్యం ఉన్న ఈ ద్వీపంలో కరోల్ రక్‌డెషెల్ ఒక చిన్న చెక్క ఇల్లు కట్టుకుని, పూర్తిగా ప్రకృతిపై ఆధారపడి జీవిస్తోంది. ఇప్పటివరకు ఆమె దాదాపు 4,000 కి పైగా చనిపోయిన ల్యాగర్‌హెడ్ తాబేళ్లకు పోస్ట్‌మార్టమ్ నిర్వహించి, అవి ఎలా చనిపోతున్నాయో పరిశోధించింది. వేటగాళ్ల వలలో చిక్కుకుని తాబేళ్లు ప్రాణాలు కోల్పోతున్నాయని ఆమె నిరూపించడంతో, అమెరికా ప్రభుత్వం పడవ వలల డిజైన్లను మార్చేలా చట్టాన్ని సవరించాల్సి వచ్చింది. ఆమె సేకరించిన తాబేళ్ల అస్థిపంజరాల ల్యాబ్ ఎంత ప్రసిద్ధి చెందిందంటే.. వాషింగ్టన్ డీసీలోని ప్రఖ్యాత 'స్మిత్సోనియన్ మ్యూజియం' శాస్త్రవేత్తలు సైతం ఆమెను కలవడానికి 700 మైళ్లు ప్రయాణించి వచ్చారు.
పర్యావరణం వర్సెస్ ప్రభుత్వ నిర్ణయాలు
ప్రస్తుతం కేరల్ వయసు 84 ఏళ్లు. అయినా, కంబర్లాండ్ ద్వీపాన్ని వాణిజ్యీకరణ నుంచి కాపాడటానికి ఆమె చేస్తున్న పోరాటం ఆగలేదు. ఈ ద్వీపంలో ప్రకృతి సమతుల్యతను కాపాడటమే ఆమె ముందున్న లక్ష్యం. ఈ లక్ష్యం నెరవేరాలంటే ద్వీపానికి పెద్ద ఎత్తున పర్యాటకులు రాకూడదు. దీనిపై ఆమె చేసిన పోరాటం ఫలితంగా రోజుకు కేవలం 300 మంది పర్యాటకులను మాత్రమే అనుమతిస్తున్నారు. కానీ, నేషనల్ పార్క్ సర్వీసెస్ ఈ సంఖ్యను కనీసం 750 కి పెంచాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. పర్యావరణం కాపాడాలంటే పర్యాటకుల సంఖ్యను పెంచకూడదని కరోల్ రక్‌డెషెల్ వాదిస్తోంది. దీనిపైనే ఆమె పోరాటం చేస్తున్నది. 84 ఏళ్ల వయసులోనూ ఆమె చేస్తున్న పోరాటం చూస్తే చేతులెత్తి దణ్ణం పెట్టొచ్చు.
ఈ ద్వీపంపై ఇప్పుడు సంపన్నుల కళ్లు పడ్డాయి. ఎలాగైనా అందమైన, అద్భుతమైన ఈ ద్వీపంలో ఇళ్లు కట్టుకోవాలని కార్పోరేట్ సంస్థతలు ప్రయత్నిస్తుండగా...కరోల్ రక్‌డెషెల్ కోర్టుల ద్వారా వారి ప్రయత్నాలను అడ్డుకుంటూనే ఉంది. కానీ, ఎంత వరకో తెలియదు. గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మి కార్టర్ వంటి ప్రముఖులకు లేఖలు రాసి మద్దతు కూడగట్టింది. ప్రస్తుతం వైల్డ్ కంబర్లాండ్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా పర్యావరణాన్ని కాపాడేందుకు యువ శాస్త్రవేత్తలను ఏకం చేస్తున్నది. ఆధునిక మనిషి తన దుశారతో ప్రకృతిని నాశనం చేస్తుంటే...వాటిని రక్షించడమే ధ్యేయంగా కేరల్ చేస్తున్న పోరాటం ప్రపంచ పర్యావరణ ఉద్యమానికి ఊపిరినిస్తోంది. ఆమె స్పూర్తితో పలు దేశాల్లో పర్యావరణాన్ని కాపాడేందుకు యువత ముందుకు వస్తున్నారంటే ఆశ్చర్యపోనవసరం లేదు.




