Street Dog: వీధి కుక్క కోసం రెండు దేశాల మధ్య యుద్ధం
Street Dog: ఒక వీధి కుక్క జాతి కోసం బ్రెజిల్, మెక్సికో దేశాల మధ్య నడుస్తున్న సోషల్ మీడియా యుద్ధం.
Street Dog: వీధి కుక్క కోసం రెండు దేశాల మధ్య యుద్ధం
Brazil vs Mexico: సాధారణంగా దేశాల మధ్య సరిహద్దు వివాదాలు లేదా వాణిజ్య యుద్ధాలు జరగడం సహజం. కానీ, ఇప్పుడు ఒక వీధి కుక్క జాతి కోసం రెండు పెద్ద దేశాలు సోషల్ మీడియా వేదికగా కొట్టుకుంటున్నాయి. వినడానికి వింతగా ఉన్నా.. ‘కారామెల్ డాగ్’ అనే శునక జాతి కోసం బ్రెజిల్, మెక్సికో దేశాల మధ్య ఇప్పుడు ఒక సాంస్కృతిక యుద్ధం నడుస్తోంది.
ఎవరీ కారామెలో? ఏంటీ రచ్చ?
ముదురు గోధుమ రంగులో ఉండే ఈ వీధి కుక్కలను బ్రెజిలియన్లు ‘కారామెలో’ అని పిలుచుకుంటారు. ఇది కేవలం ఒక కుక్క కాదు, బ్రెజిల్ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక. శతాబ్దాల క్రితం వివిధ దేశాల నుంచి వచ్చిన సుమారు 300 జాతుల సమ్మేళనమే ఈ శునకం అని వారి నమ్మకం. ఇది బ్రెజిల్ సంస్కృతిలో ఎంతలా కలిసిపోయిందంటే..నెట్‌ఫ్లిక్స్ సినిమాల్లో ఈ కుక్కలు కనిపిస్తాయి. బ్రెజిల్ కరెన్సీ నోట్లపై ఈ కుక్క బొమ్మ ముద్రించాలని ఏకంగా 50 వేల మంది సంతకాలు చేశారు. మీమ్స్ నుంచి టీ-షర్ట్స్ వరకు అక్కడ అంతా కారామెలో మయమే.
మెక్సికో ఎంట్రీతో మొదలైన అసలు గొడవ..
ఈ కారామెలో జాతికి తమ చరిత్రతో సంబంధం ఉందని, ఇది తమ సంస్కృతిలో భాగమని మెక్సికో పర్యావరణ సంస్థ దీనిని తమ జాతీయ చిహ్నంగా ప్రకటించింది. అంతే.. బ్రెజిల్ పౌరులకు పూనకం వచ్చేసింది! "మా వీధి కుక్కను, మా దేశ సంస్కృతిని దొంగిలించే హక్కు మీకు ఎవరిచ్చారు?" అంటూ మెక్సికోపై సోషల్ మీడియాలో డిజిటల్ దాడి మొదలుపెట్టారు.
జంతు ప్రేమికులు ఏమంటున్నారు?
ఈ వివాదం ఇలా ఉంటే, జంతు సంక్షేమ కార్యకర్తలు మరో కోణాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఇరు దేశాల వాతావరణం, చరిత్ర ఒకేలా ఉన్నందున ఇది మొత్తం లాటిన్ అమెరికాకే సొంతమని కొందరి వాదన. బ్రెజిల్‌లోని 2 కోట్ల వీధి కుక్కల్లో 90% ఈ జాతివే. జన్యు వైవిధ్యం వల్ల ఇవి చాలా దృఢంగా, తెలివైనవిగా ఉంటాయి. ఈ జాతి ఎవరిది అన్న గొడవ పక్కన పెట్టి, వీధుల్లో తిరిగే ఈ మూగజీవాలను దత్తత తీసుకుని ఆదరించాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.




