Abdul El Sayed: అమెరికా సెనేటర్ భార్య మన దక్షిణాది అమ్మాయే.. కర్ణాటకతో ప్రత్యేక అనుబంధం!
Abdul El Sayed: అమెరికా మధ్యంతర ఎన్నికలు 2026లో అబ్దుల్ ఎల్-సయీద్ సాధించిన విజయం ఒక కొత్త చరిత్రను లిఖించింది.
Abdul El Sayed: అమెరికా సెనేటర్ భార్య మన దక్షిణాది అమ్మాయే.. కర్ణాటకతో ప్రత్యేక అనుబంధం!
Abdul El Sayed: అమెరికా మధ్యంతర ఎన్నికలు 2026లో అబ్దుల్ ఎల్-సయీద్ సాధించిన విజయం ఒక కొత్త చరిత్రను లిఖించింది. అమెరికా చరిత్రలోనే తొలి ముస్లిం సెనేటర్‌గా ఆయన గెలుపొందడం అంతర్జాతీయంగా వార్తల్లో నిలవగా, ఈ విజయం కర్ణాటకలోని ఒక చిన్న గ్రామానికి సరికొత్త గుర్తింపు తెచ్చింది. ఇందుకు కారణం ఆయన సతీమణి డాక్టర్ సారా జుకాకు కుటుంబ మూలాలు మంగళూరుకు దాదాపు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న భట్కల్ గ్రామంలో ఉండటమే!
మిచిగాన్ యూనివర్సిటీలో చిగురించిన పరిచయం
వృత్తిరీత్యా సైకియాట్రిస్ట్ (మనస్తత్వ నిపుణురాలు) అయిన డాక్టర్ సారా జుకాకు, అబ్దుల్ ఎల్-సయీద్‌లు మిచిగాన్ యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో కలిశారు. 'ది మిచిగాన్ డైలీ' పత్రిక కథనం ప్రకారం, ఎల్-సయీద్ డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడే వీరిద్దరికీ నిశ్చితార్థం జరగ్గా, 2006లో వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది జరిగిన మధ్యంతర ఎన్నికల ప్రచారంలో సారా అత్యంత చురుగ్గా పాల్గొన్నారు. ఒక ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ.. "నేను చెప్పిన మాట తప్ప ఆయన వేరే ఎవరి మాటా వినరు" అని ఫన్నీగా వ్యాఖ్యానించి అందరి దృష్టిని ఆకర్షించారు.
ఘనమైన నేపథ్యం ఉన్న జుకాకు కుటుంబం
సారా తండ్రి జుకాకు తయ్యబ్ వృత్తిరీత్యా నెఫ్రాలజిస్ట్ (కిడ్నీ నిపుణులు). భట్కల్‌లో పెరిగిన ఆయన ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత అమెరికాకు వలస వెళ్లారు. సారా తాతగారైన జుకాకు షంషుద్దీన్ ప్రముఖ లాయర్‌గా, విద్యావేత్తగా పేరుగాంచారు. నాటి జమ్‌ఖండి సంస్థానం (ప్రస్తుత కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లా) ముఖ్యమంత్రి బీడీ జట్టీ ప్రభుత్వంలో ఆయన ఆర్థిక శాఖ ఉప మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. డాక్టర్ సారా మిచిగాన్‌లోనే పుట్టి పెరిగారు. ఆమె 2015లో కొలంబియా యూనివర్సిటీకి చెందిన వేగెలోస్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ అండ్ సర్జన్స్ నుంచి మెడికల్ డిగ్రీ పొంది, అనంతరం సైకియాట్రీలో స్థిరపడ్డారు.
కర్ణాటకలో సంబరాలు.. "మా అల్లుడి విజయం గర్వకారణం"
అమెరికా ఎన్నికల్లో డెమోక్రాట్ల ప్రభంజనంలో భాగంగా అబ్దుల్ ఎల్-సయీద్ విజయం సాధించడంతో బాగల్‌కోట్ ప్రజలు, జుకాకు కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. "మా జుకాకు కుటుంబానికి చెందిన వ్యక్తి అమెరికాలో ఇంతటి కీలకమైన పదవికి ఎన్నికవ్వడం మనందరికీ ఎంతో గర్వకారణం. ఆయనకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు" అని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.
"అరబ్ కంటే ఎక్కువగా ఇండియన్‌లా మారిపోయా!"
వారి పెళ్లయి రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా సౌత్ ఇండియన్ సంప్రదాయాల గురించి ఎల్-సయీద్ గతంలో సరదాగా మాట్లాడారు. "నేను సౌత్ ఇండియన్ కుటుంబంలోకి అల్లుడిగా వచ్చి 20 ఏళ్లవుతోంది. భారతదేశపు ఆచార వ్యవహారాలు నాకు బాగా అలవాటయ్యాయి. బహుశా నేను అరబ్ కంటే ఎక్కువగా ఇండియన్‌లా మారిపోయానేమో!" అని ఒక ఇంటర్వ్యూలో నవ్వుతూ వ్యాఖ్యానించారు. మరొక సందర్భంలో విలేకరులతో మాట్లాడుతూ.. "నేను ఎప్పుడూ దేశీ మహిళలతోనే చుట్టుముట్టి ఉంటాను.. నాకు ఇద్దరు దేశీ కూతుళ్లు (ఎమ్మాళీ, సిరీన్), ఒక దేశీ భార్య ఉన్నారు" అని ఎంతో ఆప్యాయంగా పంచుకున్నారు.




