ఆఫ్ఘనిస్తాన్‌లో ఘోర పేలుడు.. ఏడుగురు మృతి, 97 మందికి గాయాలు
Afghanistan Explosion: ఒక మాధ్యమిక పాఠశాల సమీపంలో జరిగిన పేలుడులో ఏడుగురు మరణించగా, మరో 97 మంది గాయపడ్డారు.
ఆఫ్ఘనిస్తాన్‌లో ఘోర పేలుడు.. ఏడుగురు మృతి, 97 మందికి గాయాలు
Afghanistan Explosion: తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లోని కునార్ ప్రావిన్స్‌లో శనివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒక మాధ్యమిక పాఠశాల సమీపంలో జరిగిన పేలుడులో ఏడుగురు మరణించగా, మరో 97 మంది గాయపడ్డారు. ప్రావిన్స్ రాజధాని అసదాబాద్‌లోని షాగీ మిడిల్ స్కూల్ దగ్గర ఉన్న ఒక ఇంట్లో ఈ పేలుడు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు.
ఉదయం 10 గంటలకు ఘటన.. క్షతగాత్రులకు చికిత్స
శనివారం ఉదయం సుమారు 10 గంటల ప్రాంతంలో ఈ పేలుడు జరిగినట్లు కునార్ రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం ప్రతినిధి ఫరీద్ దేహ్‌ఖాన్ తెలిపారు. ఘటన అనంతరం ఏడు మృతదేహాలతో పాటు 97 మంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారని కునార్ సమాచార, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ సమీయుల్ హక్ బయాన్ టోలోన్యూస్‌కు చెప్పారు. స్వల్ప గాయాలైన కొందరికి కునార్ ప్రావిన్షియల్ ఆసుపత్రిలో చికిత్స అందించి డిశ్చార్జ్ చేశారని, మిగిలిన వారికి చికిత్స కొనసాగుతోందని ఆయన వివరించారు.
పేలుడు పదార్థాలే కారణమా?
కునార్ - నూరిస్తాన్ హైవేపై మైనింగ్ పనులు, రాళ్ల తొలగింపు కోసం సిద్ధం చేస్తున్న పేలుడు పదార్థాలు షాగీ మిడిల్ స్కూల్ సమీపంలోని ఒక ఇంట్లో పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమీయుల్ హక్ బయాన్ తెలిపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.




