Africa: ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్న ఆఫ్రికా... ఎరువుల సంక్షోభాన్ని అధికమించేందుకు భారీ కసరత్తు

ఆఫ్రికాలో హరిత విప్లవం మొదలైంది. పూర్వం రోజుల్లో వినియోగించే సంప్రదాయ, ప్రకృతి వ్యవసాయ పద్దతులు ఉపయోగించి పంటలు పండిస్తున్నారు.

Balachander
Published on: 19 May 2026 11:42 AM IST
Africa: ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్న ఆఫ్రికా... ఎరువుల సంక్షోభాన్ని అధికమించేందుకు భారీ కసరత్తు
X

Africa: మనిషికి కావలసిన ప్రాధమిక అవసరాలు కూడు గూడు గుడ్డ. గూడు గుడ్డ సంగతి ఎలా ఉన్నా కూడు లేకుంటే మనిషి బతుకు ఆగమౌతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణం కారణంగా ఇంధన ధరలతో పాటు రసాయన ఎరువుల ధరలు ఆకాశాన్ని తాకాయి. ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అయ్యే ఎరువులలో సుమారు 20 శాతం హార్ముజ్ జలసంధి గుండానే రవాణా జరగాలి. కానీ, ప్రస్తుత పరిస్థితులు అందుకు అనుకూలంగా లేకపోవడంతో ఎక్కడిక్కడే ఆగిపోయాయి. ఈ అంతర్జాతీయ సంక్షోభం ఆఫ్రికా ఖండాన్ని తీవ్రంగా కుదిపేస్తోంది. అయితే, ఈ కష్టాన్ని ఒక అవకాశంగా మార్చుకుంటూ ఆఫ్రికా దేశాలు ఇప్పుడు రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా సంప్రదాయ, ప్రకృతి వ్యవసాయం వైపు వేగంగా అడుగులు వేస్తూ ప్రపంచానికి సరికొత్త ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఆఫ్రికాలో హరిత విప్లవం ఏ స్థాయిలో ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

పాత తప్పుల నుండి నేర్చుకున్న పాఠం

గతంలో 2008 నాటి ప్రపంచ ఆహార సంక్షోభం సమయంలో, అంతర్జాతీయ బ్యాంకులు, ఆఫ్రికా ప్రభుత్వాలు కలిసి రసాయన ఎరువులకు భారీగా సబ్సిడీలు ఇచ్చాయి. దీనివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువైంది. ఉదాహరణకు, మలావి దేశం ఎరువుల సబ్సిడీల కోసం ఎంతగా ఖర్చు చేసిందంటే.. ఆఖరికి విద్య, మౌలిక వసతుల బడ్జెట్‌ను కూడా తగ్గించుకోవాల్సి వచ్చింది. అంతేకాదు, ఆఫ్రికాలోని అతిపెద్ద యూరియా కర్మాగారాలు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా కేవలం వారం రోజుల్లోనే ధరలను 40 శాతం పెంచేయడంతో స్థానిక రైతులకు ఎరువులు భారం అయ్యాయి. వీటికి తోడు ఫాస్ఫేట్ ఫ్యాక్టరీల వల్ల పర్యావరణం, మానవ ఆరోగ్యం దెబ్బతిన్నాయి.

సంప్రదాయ ఎరువులే ఆఫ్రికా వజ్రాయుధం

ఈ రసాయన విషవలయం నుండి బయటపడటానికి ఆఫ్రికా రైతాంగం ఇప్పుడు తమ పూర్వీకుల నాటి సంప్రదాయ పద్ధతులను నమ్ముకుంటోంది. పశ్చిమ ఆఫ్రికాలో కర్రపెండలం, సాహెల్ ప్రాంతంలో జొన్నలు, గ్రేట్ లేక్స్ పరిసరాల్లో అరటి వంటి పంటలను ఎటువంటి రసాయనాలు లేకుండానే పండిస్తున్నారు. అదేవిధంగా ట్యునీషియా, సెనెగల్ వంటి దేశాల్లో రైతు సంఘాలు ఉమ్మడిగా కలిసి రసాయన రహిత ఆహార వ్యవస్థలను ప్రోత్సహిస్తున్నాయి. ట్యునీషియాలో "నూర్రితుర్ సితోయెన్" అంటే పౌర ఆహారం అనే ప్రత్యేక లేబుల్‌తో రసాయనాలు లేని పంటలను విక్రయిస్తూ సరికొత్త ట్రెండ్ సృష్టించారు.

ఆశ్చర్యపరుస్తున్న ఫలితాలు

రసాయన ఎరువులు వాడకపోతే దిగుబడి తగ్గుతుందనేది అపోహ మాత్రమేనని ఆఫ్రికా నిరూపించింది. 52 దేశాల్లోని 208 వ్యవసాయ ప్రాజెక్టులపై, సుమారు 90 లక్షల మంది రైతులతో జరిపిన అధ్యయనాల ప్రకారం.. ప్రకృతి పద్ధతులు వాడినప్పుడు జొన్నలు, మొక్కజొన్న, దుంపల దిగుబడి ఏకంగా 50 నుండి 100 శాతం పెరిగింది. సెనెగల్‌లో సాధారణ రైతులతో పోలిస్తే ప్రకృతి వ్యవసాయం చేసిన రైతుల దిగుబడి 17 శాతం, ఆదాయం 36 శాతం పెరిగింది. బ్రెజిల్‌లో అయితే ఈ దిగుబడి 49 శాతం, ఆదాయం 177 శాతం పెరగడం విశేషం.

కార్పొరేట్ సంస్థల చేతుల్లో ఉండే కృత్రిమ ఎరువుల కోసం విదేశీ మారక ద్రవ్యాన్ని తగలేయడం కంటే, స్థానిక వనరులతో భూమిని రక్షించుకుంటూ పంటలు పండించడమే ఉత్తమమని ఆఫ్రికా నిరూపిస్తోంది. శిలాజ ఇంధన ఆధారిత ఎరువులను దూరం పెట్టి, పర్యావరణాన్ని కాపాడుతూ ఆఫ్రికా దేశాలు చూపుతున్న ఈ బాట ఖచ్చితంగా మిగతా ప్రపంచ దేశాలకు కనువిప్పు కలిగించే విషయమే! ఆఫ్రికా దేశాలు భవిష్యత్‌ వ్యవసాయానికి మార్గం చూపుతున్నాయి. సంప్రదాయ, ప్రకృతి వ్యవసాయ పద్దతులను పాటిస్తే పంట దిగుబడి పెరగడంతో పాటు పర్యావరణం నుంచి భూమి రక్షించబడుతుంది. అంతేకాకుండా ఆరోగ్యవంతమైన ఆహారం కూడా ప్రజలకు అందుతుంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story