Africa Critical Minerals: ఆసియా, యూరప్‌ దేశాల్లో సంక్షోభం...అభివృద్ధిపదంలో ఆఫ్రికా

లిథియం, కోబాల్ట్, నికెల్ వంటి కీలక ఖనిజాల ఎగుమతిపై ఆఫ్రికా దేశాలు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తున్నాయి? అమెరికా, చైనా, యూరప్‌కు ఎదురవుతున్న సవాళ్లు, ఆఫ్రికా కొత్త వ్యూహం గురించి తెలుసుకుందాం.

Balachander
Published on: 2 July 2026 9:11 AM IST
Africa Critical Minerals: ఆసియా, యూరప్‌ దేశాల్లో సంక్షోభం...అభివృద్ధిపదంలో ఆఫ్రికా
X

Africa Critical Minerals: అంతర్జాతీయ పారిశ్రామిక, ఆర్థిక రంగాల్లో శతాబ్దాలుగా ఒక అలిఖిత సూత్రం నడుస్తోంది. అదేంటంటే.. వెనుకబడిన లేదా అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి ముడి ఖనిజాలను తక్కువ ధరకే కొనేసి, వాటిని సంపన్న దేశాలకు తరలించి, అక్కడ వస్తువులుగా మార్చి మళ్లీ భారీ ధరలకు ప్రపంచవ్యాప్తంగా అమ్మడం. కానీ, ఇప్పుడు ఆఫ్రికా ఖండం ఈ పాత దోపిడీ సూత్రాన్ని తిరగరాస్తోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన రంగాలకు అత్యంత కీలకమైన లీథియం, గ్రాఫైట్, కోబాల్ట్, రాగి వంటి క్రిటికల్ మినరల్స్ విషయంలో ఆఫ్రికా దేశాలు తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు ఇప్పుడు అమెరికా, చైనా వంటి అగ్రరాజ్యాలను సైతం ముప్పతిప్పలు పెడుతున్నాయి.

జీ7 వేదికగా సంచలన నిర్ణయం

ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సదస్సులో కెన్యా అధ్యక్షుడు విలియం రుటో అమెరికాతో ఒక కీలక ఒప్పందంపై ప్రకటిస్తూ ఒక కఠినమైన షరతు పెట్టారు. తమ దేశంలో లభించే లీథియం, నికెల్, కాపర్ వంటి ఖనిజాలను ముడి రూపంలో ఎగుమతి చేసే ప్రసక్తే లేదని, వాటిని తమ దేశంలోనే ప్రాసెస్ చేసి, వాల్యూ యాడింగ్ చేసిన తర్వాతే విదేశాలకు పంపుతామని స్పష్టం చేశారు. కేవలం కెన్యా మాత్రమే కాదు.. నమీబియా ముడి లీథియం, కోబాల్ట్ ఎగుమతులపై నిషేధం విధించగా, మాలీ దేశం ఏటా 200 టన్నుల సామర్థ్యం గల గోల్డ్ రిఫైనరీని నిర్మిస్తోంది. అలాగే ఘనా దేశం జూలై 2026 నుండి తమ దేశంలోని భారీ మైనింగ్ కంపెనీల నుంచి 30 శాతం బంగారాన్ని స్థానికంగానే కొనుగోలు చేసి రిజర్వులను బలోపేతం చేయాలని నిర్ణయించింది.

ఆఫ్రికా చేతికి చిక్కిన ప్రపంచ ఆర్థిక తాళంచెవి

ఈ వ్యూహాత్మక మార్పు వెనుక బలమైన అంతర్జాతీయ మార్కెట్ లెక్కలు ఉన్నాయి. గత 2024లోనే ప్రపంచవ్యాప్తంగా లీథియం వినియోగం 30 శాతం పెరిగింది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అంచనాల ప్రకారం, 2040 నాటికి లీథియం అవసరం 5 రెట్లు పెరగనుంది. కానీ, కొత్త మైనింగ్ ప్రాజెక్టులు ప్రారంభం కావడానికి కనీసం ఒక దశాబ్దం పడుతుంది. దీనివల్ల 2035 నాటికి ప్రపంచవ్యాప్తంగా లీథియం సరఫరాలో 40 శాతం కొరత ఏర్పడనుంది.

గ్లోబల్ లీథియం అయాన్ సప్లై చైన్ విలువల వృద్ధి ఎలా ఉందో తెలుసుకుందాం. ముడి ఖనిజం ఎగుమతులు 20 బిలియన్‌ డాలర్లు ఉంటే, బ్యాటరీ మెటీరియల్స్‌ 51 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక సెల్ఫ్‌, బ్యాటరీ ప్యాక్ 106 బిలియన్ డాలర్లు, ఎలక్ట్రిక్‌ వాహనాలు 135 బిలియన్ డాలర్లుగా ఉంది. వీటన్నింటికీ లిథియం అయాన్‌ మూలకం చాలా అవసరం. ఈ మూలకం ఎక్కువగా ఆఫ్రికా దేశాల్లోనే దొరుకుతుంది. ప్రపంచ వ్యాప్తంగా మైనింగ్‌ ప్రారంభం కావడానికి మరో పదేళ్లు పడుతుంది కాబట్టి ఈ పదేళ్ల కాలంలో ఆఫ్రికా దేశాలు వీలైనంత వరకు శుద్ధిచేసిన లిథియంను ఎక్స్‌పోర్ట్‌ చేసేందుకు ప్రయత్నిస్తాయి.

ముడి ఖనిజం కంటే దానిని బ్యాటరీగా మార్చినప్పుడే అసలైన సంపద సృష్టించబడుతుందని స్పష్టమవుతోంది. ఆఫ్రికా ఖండం స్థానికంగానే ఈ ప్రాసెసింగ్ పరిశ్రమలను ఏర్పాటు చేయడం ద్వారా ఏటా 32 బిలియన్‌ డాలర్ల అదనపు ఎగుమతి ఆదాయాన్ని సాధించడమే కాకుండా, దాదాపు 23 లక్షల కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించగలదని ‘పబ్లిష్ వాట్ యూ పే’ పరిశోధనలు చెబుతున్నాయి.

ఇండోనేషియా సక్సెస్ ఫార్ములా.. నైజీరియా ఆదర్శం

ఆఫ్రికా దేశాల ఈ దూకుడుకు ఇండోనేషియా విజయగాథే స్పూర్తి. జనవరి 1, 2020 నాడు ఇండోనేషియా ముడి నికెల్ ఎగుమతులను పూర్తిగా నిషేధించింది. ఫలితంగా 2015లో కేవలం బిలియన్ డాలర్లలోపు ఉన్న వారి నికెల్ ఉత్పత్తుల ఎగుమతి విలువ, 2022 నాటికి ఏకంగా 20 బిలియన్ డాలర్లకు చేరింది. అలాగే నైజీరియాలో 20 బిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించిన, రోజుకు 6.5 లక్షల బ్యారెళ్ల సామర్థ్యం గల 'డంగోటే రిఫైనరీ' ఆఫ్రికా పారిశ్రామిక సత్తాకు నిదర్శనంగా నిలిచింది. 2026 ఫిబ్రవరి - మార్చి మధ్య కాలంలోనే ఈ రిఫైనరీ నుండి పెట్రోలియం ఎగుమతులు రోజుకు లక్ష బ్యారెళ్ల నుండి 2.14 లక్షల బ్యారెళ్లకు పెరిగాయి.

ప్రస్తుతం వ్యూహాత్మక ఖనిజాల శుద్ధి రంగంలో చైనాకు ఏకఛత్రాధిపత్యం ఉంది. ప్రపంచంలోని టాప్ 20 వ్యూహాత్మక ఖనిజాలలో 19 ఖనిజాల శుద్ధి ప్రక్రియను చైనాయే శాసిస్తోంది. కాపర్, లీథియం, నికెల్ వంటి కీలక ఖనిజాల ప్రాసెసింగ్‌లో కేవలం మూడు దేశాలే 86 శాతం మార్కెట్‌ను నియంత్రిస్తున్నాయి. ఈ ఏకఛత్రాధిపత్యాన్ని దెబ్బతీయాలనే పాశ్చాత్య దేశాల ఆరాటాన్ని ఆఫ్రికా తన ఎదుగుదలకు పెట్టుబడిగా మార్చుకుంటోంది. ఆఫ్రికన్ కాంటినెంటల్ ఫ్రీ ట్రేడ్ ఏరియా ద్వారా ఆఫ్రికా దేశాలన్నీ ఒకే తాటిపైకి వచ్చి, ప్రాంతీయంగా పరిశ్రమలను అనుసంధానించగలిగితే.. ఇకపై గ్లోబల్ మార్కెట్లు ఆఫ్రికా షరతులకు తలవంచక తప్పదు. ఒకప్పుడు వలస పాలకుల దోపిడీకి గురైన ఆఫ్రికా, నేడు గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్‌ను శాసించే స్థాయికి చేరడం అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక పెను మార్పుగా చెప్పవచ్చు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story