African Troops to Gaza: ఆసియాలో మరో కీలక పరిణామం... గాజాకు ఆఫ్రికా సైన్యం
గాజాలో శాంతి పరిరక్షణ కోసం ప్రతిపాదించిన అంతర్జాతీయ స్టెబిలైజేషన్ ఫోర్స్‌లో ఉగాండా, బురుండి సైన్యాలను మోహరించే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. ఆసియాలో జరగుతున్న ఈ కీలక పరిణామంపై ప్రత్యేక కథనం
African Troops to Gaza: గాజాలో శాంతిభద్రతల పరిరక్షణకు అంతర్జాతీయ వేదికపై ఒక ఊహించని వినూత్న పరిణామం చోటుచేసుకుంటోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను చల్లార్చేందుకు, కాల్పుల విరమణను అమలు చేసేందుకు ఏర్పాటు చేయతలపెట్టిన 'ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్' కోసం ఆఫ్రికా ఖండానికి చెందిన ఉగాండా, బురుండి దేశాలు తమ మిలటరీ బలగాలను రంగంలోకి దించేందుకు సిద్ధమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో రూపొందిన 'బోర్డ్ ఆఫ్ పీస్' ప్రణాళికలో భాగంగా ఈ చర్చలు శరవేగంగా జరుగుతున్నాయి.
గాజా పీస్ ఫోర్స్ర్...రంగంలోకి ఆఫ్రికా సైన్యం
ఇప్పటికే ఈ ప్రక్రియలో భాగంగా ఉగాండా, బురుండి దేశాల మిలటరీ ప్రతినిధులు ఇజ్రాయెల్‌లో పర్యటించి కీలక భద్రతా విషయాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. ఆఫ్రికా యూనియన్ మిషన్‌లో భాగంగా సోమాలియాలో అల్-ఖైదా అనుబంధ ఉగ్రవాద మూకలతో పోరాడిన అనుభవం ఈ రెండు దేశాల సైన్యానికి ఉంది. గాజాలో శాంతి పరిరక్షణ కోసం మొత్తం 20,000 మందితో కూడిన అంతర్జాతీయ దళాన్ని మోహరించాలని అమెరికా భావిస్తోంది. అయితే, ఈ అంతర్జాతీయ సైన్యానికి అమెరికా మేజర్ జనరల్ జాస్పర్ జెఫర్స్ నాయకత్వం వహించనున్నారు. కాగా, ఉగాండా పార్లమెంట్ ఆమోదంతో దాదాపు 1,200 మంది సైనికులను పంపేందుకు రాతపూర్వక అంగీకారం తెలిపింది. అంతేకాదు, మొరాకో 500 మందిని, కొసోవో, కజకిస్తాన్, అల్బేనియా దేశాలు కలిపి మరో 80 మందిని పంపేందుకు అంగీకరించాయి. ఇండోనేషియా గతంలో 8,000 మంది బలగాలను పంపుతామని ప్రకటించినా, ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా పక్కనబెట్టింది.
గాజా పీస్ ఫోర్స్ లక్ష్యం
ఈ శాంతి దళాల ప్రధాన బాధ్యత గాజాలోని కాల్పుల విరమణను పర్యవేక్షించడం, పాలస్తీనా పోలీసులకు తగిన శిక్షణ ఇవ్వడం, సాయం అందేలా చూడటం. అయితే, గాజా భూభాగంలో 60 శాతానికి పైగా నియంత్రణ సాధించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, హమాస్ ఆయుధాలను పూర్తిగా త్యజించే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఉగాండా, బురుండి దేశాలు తమ మిలటరీకి కావలసిన ఆర్థిక, సాంకేతిక మద్దతు కోసం అమెరికా ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ మిషన్‌లో చేరడానికి మొగ్గు చూపుతున్నాయి. గాజాలో కాల్పుల విరమణపై ప్రతిష్టంభన కొనసాగుతున్నప్పటికీ, ఆఫ్రికా బలగాల రాకతో పశ్చిమాసియా వ్యూహాత్మక సమీకరణలు సరికొత్త మలుపు తిరుగుతున్నాయి.




