ప్రపంచ వాణిజ్యానికి షాక్.. బాబ్ అల్ మాండెబ్‌పై హూతీల హెచ్చరిక
Bab al-Mandeb: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల మధ్య ప్రపంచం మరో మహా సంక్షోభం దిశగా పయనిస్తోంది.
ప్రపంచ వాణిజ్యానికి షాక్.. బాబ్ అల్ మాండెబ్‌పై హూతీల హెచ్చరిక
Bab al-Mandeb: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల మధ్య ప్రపంచం మరో మహా సంక్షోభం దిశగా పయనిస్తోంది. ఇప్పటికే హర్మూజ్ జలసంధి మూసివేతతో చమురు సరఫరా నిలిచిపోగా, ఇప్పుడు యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులు 'బాబ్ అల్ మాండెబ్' జలసంధిని కూడా మూసివేస్తామని హెచ్చరించారు. ఇది జరిగితే అంతర్జాతీయ వాణిజ్యానికి గుండెకాయ వంటి సూయజ్ కాలువ మార్గం పూర్తిగా మూతపడి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది.
ట్రంప్ విధానాలపై హూతీల సంచలన హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు ప్రపంచ శాంతికి ఆటంకం కలిగిస్తున్నాయని హూతీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ట్రంప్ తన పంథాను మార్చుకోకపోతే, ఎర్ర సముద్రాన్ని అరేబియా సముద్రంతో కలిపే బాబ్ అల్ మాండెబ్ జలసంధిని శాశ్వతంగా మూసివేస్తామని హూతీ విదేశాంగ శాఖ ఉప మంత్రి హుస్సేన్ హెచ్చరించారు.
"ఒక్కసారి మేము దీనిని మూసివేస్తే, తిరిగి తెరిపించడం ప్రపంచంలోని ఏ శక్తీకీ సాధ్యం కాదు" అని ఆయన స్పష్టం చేయడం గమనార్హం. అమెరికాకు సహకరించే దేశాలు కూడా ఈ విధ్వంసం నుంచి వెనక్కి మళ్లాలని, అది అందరికీ శ్రేయస్కరమని ఆయన హితవు పలికారు.
సూయజ్ కాలువ , బాబ్ అల్ మాండెబ్ ప్రాముఖ్యత
బాబ్ అల్ మాండెబ్ జలసంధి యెమెన్ , జిబౌటి మధ్య ఉంది. ఇది ఎర్ర సముద్రాన్ని అరేబియా సముద్రంతో అనుసంధానిస్తుంది. సూయజ్ కాలువ దిశగా వెళ్లే ప్రతి నౌకకు ఇది ఏకైక కీలక మార్గం.
నిత్యం ఈ మార్గంలో 45 లక్షల బ్యారెళ్ల చమురు రవాణా అవుతోంది. అంతర్జాతీయ వాణిజ్యంలో 10-12 శాతం దీని ద్వారానే జరుగుతుంది. ఏటా సుమారు రూ. 93.95 లక్షల కోట్ల విలువైన సరకులు ఈ మార్గం గుండా పయనిస్తాయి. ప్రధాన మార్కెట్ల మధ్య గ్యాస్, ఆహార పదార్థాలు మరియు తయారీ వస్తువుల రవాణాకు ఇది వెన్నెముక వంటిది.
గ్లోబల్ ఎకానమీపై పిడుగు
ఈ జలసంధి కేవలం 30 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. దీనిని మూసివేస్తే, నౌకలు ఆఫ్రికా ఖండాన్ని చుట్టుముట్టి వేల కిలోమీటర్ల అదనపు దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. దీనివల్ల రవాణా వ్యయం పెరిగి, ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటుతుంది. హర్మూజ్ , బాబ్ అల్ మాండెబ్ రెండూ మూతపడితే, ప్రపంచ దేశాలు అంధకారంలోకి వెళ్లే అవకాశం ఉంది.
హెజ్బొల్లా అసంతృప్తి
మరోవైపు, ఇజ్రాయెల్‌తో జరిగిన ఏకపక్ష కాల్పుల విరమణ ఒప్పందం లెబనాన్‌కు అవమానకరమని హెజ్బొల్లా నేత నయీమ్ అభివర్ణించారు. 2024లో ఇజ్రాయెల్ ఒప్పందాలను ఉల్లంఘించి పౌరులపై దాడులు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అటు ఇరాన్, ఇటు హూతీలు , హెజ్బొల్లా గ్రూపులు ఏకకాలంలో ఒత్తిడి పెంచుతుండటంతో మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకున్నాయి.




