AI Designed Vaccine: వైద్యరంగంలో మహాద్భుతంః ఏఐతో వ్యాక్సిన్‌ రూపకల్పన

భవిష్యత్ మహమ్మారులను ముందుగానే అడ్డుకునే లక్ష్యంతో రూపొందిన కొత్త వ్యాక్సిన్ వైద్యరంగంలో సంచలనం సృష్టిస్తోంది. కరోనా, ఫ్లూ, ఎబోలా వంటి వైరస్‌లపై విస్తృత రక్షణ కల్పించే ఈ పరిశోధన వివరాలను తెలుసుకుందాం.

Balachander
Published on: 5 Jun 2026 1:18 PM IST
AI Designed Vaccine: వైద్యరంగంలో మహాద్భుతంః ఏఐతో వ్యాక్సిన్‌ రూపకల్పన
X

AI Designed Vaccine: వైద్య చరిత్రలో సరికొత్త ఆవిష్కరణ చోటుచేసుకుంది. ప్రపంచాన్ని వణికించే మహమ్మారులను ముందుగానే ఊహించి వాటిని అడ్డుకునేందుకు క్రేంబ్రిడ్జ్‌కి చెందిన శాస్త్రవేత్తలు ఓ సూపర్‌ వ్యాక్సిన్‌ను సిద్ధం చేశారు. అయితే, ఈ సూపర్‌ వ్యాక్సిన్‌ను రూపొందించేందుకు వారికి ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ ఎంతగానో ఉపయోగపడింది. వ్యాక్సిన్‌లో కీలకమైన భాగం తయారీలో ఏఐ వారికి సహకరించింది. ఇలా తయారు చేసిన ఏఐ వ్యాక్సిన్‌ను నేరుగా మనుషులపై ప్రయోగించారు. జంతువులపై ప్రయోగించకుండా నేరుగా మనుషులపై ప్రయోగించడం ఇదే తొలిసారి. మొదటిదశలో 39 మందిపై పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలు విజయవంతం కావడంతో త్వరలోనే మరో 200 వందలమందిపై ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగించనున్నారు.

కాలం చెల్లిన పాత పద్ధతులకు స్వస్తి

సాధారణంగా వ్యాక్సిన్లను ప్రస్తుతం సమాజంలో ఉన్న వైరస్ రకాలను బట్టి తయారు చేస్తారు. అయితే, వైరస్‌లు నిరంతరం తమ రూపాన్ని మార్చుకుంటూ కొత్త వేరియంట్లుగా మారి దాడి చేస్తుంటాయి. దీనివల్ల మనం వాడే పాత వ్యాక్సిన్లు త్వరగా ప్రభావాన్ని కోల్పోతాయి. కరోనా, సాధారణ ఫ్లూ వ్యాక్సిన్లను ఏడాదికోసారి అప్‌డేట్ చేయాల్సి రావడానికి ఇదే కారణం. ఎప్పుడూ వైరస్ వెనకాల పడటం కంటే, అది మారే రూపాన్ని ముందే ఊహించి దెబ్బకొట్టాలనే ఆలోచనే ఈ సరికొత్త ఆవిష్కరణకు పునాది. ముందుగానే ఊహించి ముందుగానే దానికి తగ్గట్టుగా వ్యాక్సిన్‌ తయారు చేసి పెట్టడమే ప్రధానం.

ఏఐ సృష్టించిన సూపర్ యాంటిజెన్

కేంబ్రిడ్జ్ పరిశోధకులు ప్రపంచంలోని వివిధ రకాల కరోనా వైరస్‌ల జన్యు సంకేతాలను సేకరించారు. ఆ డేటాను ఆధునిక సాంకేతికతకు అప్పగించగా, అది వైరస్‌ల అన్ని రూపాలను తట్టుకోగల 'సూపర్ యాంటిజెన్'ను సృష్టించింది. యాంటిజెన్ అనేది వ్యాక్సిన్‌లోని అత్యంత ముఖ్యమైన భాగం. ఇది మన శరీరంలోకి ప్రవేశించగానే, భవిష్యత్తులో ఏ వేరియంట్ వైరస్ వచ్చినా, లేదా జంతువుల నుండి మనుషులకు కొత్త వ్యాధి సోకినా... దానిని గుర్తించి నాశనం చేసేలా మన రోగనిరోధక వ్యవస్థకు శిక్షణ ఇస్తుంది. ఈ సరికొత్త యాంటిజెన్‌ మనిషిని అన్ని రకాల వ్యాధుల నుంచి రక్షిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. అంటే ఇది సర్వరోగ నివారిణిలా పనిచేస్తుంది.

భవిష్యత్తుపై కొత్త ఆశలు

ప్రస్తుతం ఈ సాంకేతికతను కేవలం కరోనాకే పరిమితం చేయకుండా, ఏటా వేధించే సీజనల్ ఫ్లూ, పక్షులను నాశనం చేస్తున్న బర్డ్‌ ఫ్లూ, ఆఫ్రికాను వణికిస్తున్న ప్రాణాంతక ఎబోలా వైరస్‌లపై కూడా ప్రయోగిస్తున్నారు. ఈ ప్రయోగాలు విజయవంతమైతే భవిష్యత్తులో ఎలాంటి విపత్తులు ఎదురైనా వెంటనే వ్యాక్సన్‌ను వినియోగించేందుకు అవకాశం లభిస్తుంది. ఇక ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ గ్రూప్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆండీ పోలార్డ్ అభిప్రాయం ప్రకారం, ఈ సాంకేతికత వైద్యరంగంలో 'గేమ్ చేంజర్' కానుంది. మనుషుల రోగనిరోధక వ్యవస్థలు ఎలుకల కంటే భిన్నంగా ఉంటాయని, కాబట్టి మానవ ప్రయోగాల ఫలితాలు మరికొంత స్పష్టతను ఇస్తాయని ఆయన పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ, సైన్స్ సాధించిన ఈ అద్భుతం రాబోయే రోజుల్లో కోట్లాది మంది ప్రాణాలను కాపాడటంలో మైలురాయిగా నిలవబోతోంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story