Plane Crash: ల్యాండింగ్ చేస్తూ కుప్పకూలిన విమానం.. 8 మంది దుర్మరణం
Plane Crash: అమెరికాలోని అలస్కా సుదూర సైనిక విమానాశ్రయం వద్ద తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
Plane Crash
Plane Crash: అమెరికాలోని అలస్కా సుదూర సైనిక విమానాశ్రయం వద్ద తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దట్టమైన పొగమంచు కారణంగా ల్యాండింగ్ చేయడానికి రెండోసారి ప్రయత్నించిన ఒక చిన్న చార్టర్డ్ విమానం ప్రమాదవశాత్తు కుప్పకూలిపోయింది. ఈ భయానక ఘటనలో ఇద్దరు పైలట్లతో సహా విమానంలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అలస్కాలోని ఎంకరేజ్ ప్రాంతానికి పశ్చిమంగా 725 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేప్ న్యూయెన్‌హామ్ లాంగ్ రేంజ్ రడార్ సైట్ ఎయిర్‌పోర్ట్‌లో శుక్రవారం ఈ ప్రమాదం జరిగింది. రన్ వే వద్ద తీవ్రమైన పొగమంచు అలుముకోవడంతో పైలట్లకు కంటిచూపు ఆనలేదు. రన్‌వే స్పష్టంగా కనిపించకపోవడంతో విమానంలో ఉన్న అధునాతన నావిగేషన్ పరికరాల ఆధారంగానే ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే పొగమంచు ప్రభావం తీవ్రంగా ఉండటంతో రెండోసారి ల్యాండింగ్‌కు దిగిన సమయంలో విమానం రన్‌వే సమీపంలోని కొండ వాలు ప్రాంతంలో కుప్పకూలింది.
ఆర్మీ ఇంజనీర్లు, పైలట్లు దుర్మరణం
ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు, ఆరుగురు ప్రయాణికులు మరణించినట్లు నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు అధికారులు తెలిపారు. మృతుల్లో అమెరికా ఆర్మీ కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్‌కు చెందిన ఇద్దరు కీలక ఉద్యోగులు ఉన్నారు. వీరు యూఎస్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఒక ప్రాజెక్ట్ పనులను పర్యవేక్షించేందుకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద సమాచారం అందుకున్న మిలిటరీ అధికారులు, నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు దర్యాప్తు బృందాలు సహాయక చర్యలు చేపట్టేందుకు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
క్షణాల్లో మారిన వాతావరణం
ఈ రడార్ సైట్ అత్యంత క్లిష్టమైన కొండల మధ్య, రాతి మైదానంలో ఉంటుంది. 1950లో సోవియట్ యూనియన్ క్షిపణి దాడులను పసిగట్టడానికి దీనిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రష్యా, చైనా, ఉత్తర కొరియా వైపు నుంచి వచ్చే విమానాలు, క్షిపణుల కదలికలపై నిఘా ఉంచడానికి దీనిని ఉపయోగిస్తున్నారు. ప్రమాదానికి కొన్ని నిమిషాల ముందు వరకు 16 కిలోమీటర్ల వరకు స్పష్టంగా కనిపించిన వాతావరణం, కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే తీవ్రమైన దట్టమైన పొగమంచుతో నిండిపోయినట్లు వాతావరణ శాఖ తెలిపింది. చూపు సరిగా ఆనకపోవడమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.
తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అధికారులు
ఈ ఘోర ప్రమాదంపై అలస్కన్ కమాండ్ కమాండర్, లెఫ్టినెంట్ జనరల్ రాబర్ట్ డేవిస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ రక్షణ కోసం క్లిష్ట పరిస్థితుల్లో విధి నిర్వహణలో ఉన్న నిబద్ధత కలిగిన అధికారులను కోల్పోవడం మిలిటరీ కుటుంబానికి తీరని లోటని ఆయన సంతాపం తెలిపారు. విమానం నడిపిన సెక్యూరిటీ ఏవియేషన్ సంస్థ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసింది. సాంకేతిక లోపం ఉందా లేక కేవలం వాతావరణ వైపరీత్యం వల్లే ఇది జరిగిందా అనే కోణంలో దర్యాప్తు అధికారులు విచారణ ప్రారంభించారు.




