Amazon Forest: కోలుకుంటున్న అమెజాన్‌... తప్పని ఎల్‌నినో ఎఫెక్ట్‌

ఒకవైపు అమెజాన్‌ అడవులు కార్చిచ్చు నుంచి ఊపిరి పోసుకుంటున్నా... సూపర్‌ ఎల్‌నినో ఎఫెక్ట్‌ పొంచి ఉండటంతో భయాందోళనలు నెలకొన్నాయి.

Balachander
Published on: 21 July 2026 10:59 AM IST
Amazon Forest: కోలుకుంటున్న అమెజాన్‌... తప్పని ఎల్‌నినో ఎఫెక్ట్‌
X

Amazon Forest: గ్లోబల్ వార్మింగ్ విసిరే సవాళ్లను ఎదుర్కొని ప్రధాన రక్షణ కవచమైన ఆమజాన్ అడవులు మళ్లీ ఊపిరి పీల్చుకుంటున్నాయి. గతంలో చెలరేగిన కార్చిచ్చుల దెబ్బకు అతలాకుతలమైన ఆమజాన్ వర్షాధార అడవులు, తాజాగా చారిత్రాత్మక స్థాయిలో కోలుకున్నాయి. ఎన్విరాన్‌మెంటల్ మానిటరింగ్ నెట్‌వర్క్ 'మ్యాప్‌బయోమాస్' ఉపగ్రహ గణాంకాల ప్రకారం, గత ఏడాది అమెజాన్ ప్రాంతంలో తగ‌లబడిన అటవీ విస్తీర్ణం 3.1 మిలియన్ హెక్టార్లకు అంటే సుమారు 7.7 మిలియన్ ఎకరాలకు పడిపోయింది. 1985లో గ్లోబల్ ఉపగ్రహ రికార్డులు ప్రారంభమైన నాటి నుంచి ఇది అత్యంత తక్కువ కావడం గమనార్హం. 2018 తర్వాత కూడా కార్చిచ్చుల తీవ్రత అత్యల్ప స్థాయికి చేరుకుంది.

అమెజాన్‌కు ఊరట ... అటవీ నరికివేతకు కళ్లెం

గతంలో అక్రమ మైనింగ్, వ్యవసాయ భూముల కోసం అడవులకు నిప్పు పెట్టడం వల్ల విస్తారమైన అమెజాన్‌ అడవులు తగలబడిపోయేవి. 2024 - 2025 మధ్యకాలంలో వర్షాలు ఆలస్యంగా రావడం వల్ల అడవులకు నిప్పు అంటించడం ఆలస్యమైంది. అక్రమ అటవీ నిర్మూలన తగ్గడంతో మంటలు వ్యాపించడానికి తగినంత ఇంధనం దొరకలేదని అధికారులు చెబుతున్నారు. ఇక 2026 మొదటి త్రైమాసిక గణాంకాల ప్రకారం, ఈ దశాబ్దంలోనే అటవీ నిర్మూలన రేటు అత్యంత తక్కువగా నమోదైంది. ఇదిలానే కొనసాగితే మళ్లీ అమెజాన్‌ అడవులు కళకళలాడుతాయి. అటవీసంపదతో నిండుదనంగా వర్ధిల్లుతాయి. ప్రపంచానికి అవసరమైన ఆక్సీజన్‌ను అందిస్తాయి. వాయుకాలుష్యం చాలా వరకు నివారించబడుతుంది.

సూపర్ ఎల్ నినో హెచ్చరిక

అమెజాన్‌ ప్రాంతం కోలుకుంటున్నప్పటికీ, సెంట్రల్ బ్రెజిల్‌లోని 'సెరాడో' సావన్నా ప్రాంతం ఇంకా తగ‌లబడుతూనే ఉంది. రాబోయే రోజుల్లో 'సూపర్ ఎల్ నినో' ప్రవేశించే అవకాశం ఉందని, అది తీసుకొచ్చే తీవ్ర వర్షాభావం వల్ల మళ్లీ తీవ్రమైన కార్చిచ్చులు చెలరేగే ప్రమాదముందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ ఎల్‌ నినో ప్రభావం నుంచి అడవులను రక్షించుకోవలసిన బాధ్యత ప్రభుత్వంతో పాటు ప్రజలపై కుడా ఉందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. అడవులు తగలబడకుండా ఉండేందుకు కృత్రిమంగా వర్షాలు కురిపించేలా చేయాలని సూచిస్తున్నారు.

రాజకీయ పరిణామాలు

2030 నాటికి అటవీ నిర్మూలనను పూర్తిగా నిర్మూలిస్తానని బ్రెజిల్ అధ్యక్షుడు లుయిజ్ ఇనాసియో లులా డా సిల్వా హామీ ఇచ్చారు. ఈ ఏడాది అక్టోబర్‌లో జరగనున్న ఎన్నికల్లో పోటీ పడుతున్న లులాకు ఈ పర్యావరణ ఊరట రాజకీయంగా లాభించే అవకాశముంది. అయితే, అమెజాన్‌ తీర ప్రాంతంలో ముడిచమురు అన్వేషణ ప్రాజెక్టుకు ఆయన ఆమోదం తెలపడంపై పర్యావరణ వేత్తల నుండి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు అమెజాన్‌ను రక్షిస్తామని చెబుతూనే మరోవైపు ఆర్థికంగా లాభం పొందేందుకు ముడి చమురు అన్వేషణ ప్రాజెక్టులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు ఎదురౌతున్నాయి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story