అంతరిక్షంలోకి అనిల్ మీనన్.. భారత మూలాలున్న నాసా వ్యోమగామికి తొలి మిషన్
భారత మూలాలున్న నాసా వ్యోమగామి అనిల్ మీనన్ రష్యా సోయుజ్ MS-29 ద్వారా ఐఎస్‌ఎస్‌కు బయలుదేరారు. ఎనిమిది నెలల పాటు శాస్త్రీయ పరిశోధనలు చేయనున్నారు.
Anil Menon Launches To ISS Aboard Russia's Soyuz MS-29
భారతీయ మూలాలు కలిగిన నాసా వ్యోమగామి అనిల్ మీనన్ తొలిసారి అంతరిక్షంలోకి అడుగుపెట్టారు. రష్యా సోయుజ్ MS-29 వ్యోమనౌక ద్వారా కజకిస్థాన్‌లోని బైకోనూర్ కాస్మోడ్రోమ్ నుంచి మంగళవారం విజయవంతంగా ప్రయోగించారు. ఈ మిషన్‌లో రోస్కోస్మోస్‌కు చెందిన వ్యోమగాములు ప్యోటర్ డుబ్రోవ్, అన్నా కికినా కూడా ఆయనతో కలిసి ప్రయాణిస్తున్నారు.
సోయుజ్ వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)తో ప్రయోగం జరిగిన కొన్ని గంటల్లోనే అనుసంధానమయ్యేలా ప్రణాళిక రూపొందించారు. అనిల్ మీనన్ సుమారు ఎనిమిది నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉండి ఎక్స్‌పెడిషన్ 74, 75 మిషన్లలో భాగంగా శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించనున్నారు.
అనిల్ మీనన్ ఎవరు?
49 ఏళ్ల అనిల్ మీనన్ అమెరికాలోని మినియాపోలిస్‌లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు భారతీయ, ఉక్రెయిన్ మూలాలు కలిగినవారు. నాసాలో చేరకముందు అత్యవసర వైద్య నిపుణుడిగా, అమెరికా స్పేస్ ఫోర్స్‌లో కల్నల్‌గా సేవలందించారు. అంతకుముందు స్పేస్‌ఎక్స్ తొలి ఫ్లైట్ సర్జన్‌గా కూడా పనిచేశారు.
2021లో నాసా వ్యోమగాముల బృందానికి ఎంపికైన ఆయనకు ఇదే తొలి అంతరిక్ష ప్రయాణం.
అంతరిక్ష కేంద్రంలో పరిశోధనలు
అంతరిక్ష కేంద్రంలో ఉండే కాలంలో అనిల్ మీనన్ పలు కీలక పరిశోధనల్లో పాల్గొననున్నారు. మైక్రోగ్రావిటీలో సెమీకండక్టర్ క్రిస్టల్ తయారీ, అంతరిక్షంలో రక్తప్రసరణపై అధ్యయనం, కృత్రిమ మేధస్సు ఆధారిత అల్ట్రాసౌండ్ సాంకేతికత, బయోప్రింటింగ్ వంటి ప్రయోగాల్లో ఆయన భాగస్వామ్యం కానున్నారు.
అంతేకాకుండా భవిష్యత్తులో దీర్ఘకాల అంతరిక్ష యాత్రలకు ఉపయోగపడే సాంకేతికతల అభివృద్ధికి కూడా ఈ పరిశోధనలు దోహదపడనున్నాయి.




