Attacks on Indian Ships: భారత్‌ నౌకలపై దాడుల వెనుక పాక్‌ కుట్ర...నిజమెంత?

Attacks on Indian Ships: మిత్రదేశంగా భావించే ఇరాన్‌ ఇప్పుడు హఠాత్తుగా భారత వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం, వాటిపై దాడులు చేయడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది.

Balachander
Published on: 23 April 2026 12:21 PM IST
Attacks on Indian Ships
X

Attacks on Indian Ships

Attacks on Indian Ships: మిత్రదేశంగా భావించే ఇరాన్‌ ఇప్పుడు హఠాత్తుగా భారత వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం, వాటిపై దాడులు చేయడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది. అమెరికాతో ఉన్న వైరంలో భారత్‌ను పావుగా వాడుకోవాలని ఇరాన్‌ చూస్తున్నది. ఈ నేపథ్యంలో దీని వెనుక పాకిస్తాన్‌ ఏదైనా కుట్ర పన్నిందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. హోర్ముజ్‌ జలసంధిలో ఏప్రిల్‌ 15 తరువాత మారిన పరిస్థితులు, ఏప్రిల్‌ 22న రెండు వాణిజ్య నౌకలను ఇరాన్‌ సైనికులు సీజ్‌ చేయడం ఈ అనుమానాలకు ఊతం ఇస్తోంది.

మిత్రత్వం నుంచి దాడుల దాకా.. అసలేం జరిగింది?

ఈ గొడవల సంగతి పక్కనపెడితే కొన్ని దశాబ్ధాలుగా భారత్‌ ఇరాన్‌ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. రెండు దేశాల మధ్య బలమైన వాణిజ్య బంధం ఉంది. ఆంక్షల ముందు వరకు ఇరాన్‌ నుంచి పెద్ద ఎత్తున చమురును భారత్‌ కొనుగోలు చేసింది. ఏప్రిల్‌ 19 ముందు వరకు ఆంక్షలు సడలింపుల నేపథ్యంలో ఇరాన్‌ నుంచి చమురును దిగుమతి చేసుకుంది. కానీ, ఏప్రిల్‌ 22న భారత్‌లోని ముంద్రా పోర్టుకు వస్తున్న ఎపామినోండాస్‌, ఎంఎస్సీ ఫ్రాన్సెస్కా అనే రెండు నౌకలను ఇరాన్‌ బలగాలు సీజ్‌ చేశాయి. దీంతో ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. అంతేకాదు, దీనికంటే ముందు ఇరాన్‌ సన్మార్‌ హెరాల్డ్‌, జగ్‌ ఆర్ణవ్‌ అనే నౌకలపై కాల్పులు జరిగాయి. దీంతో భారత్‌ ఇరాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్‌ దౌత్యాధికారికి నోటీసులు జారీ చేసింది.

ఇరాన్ 'బ్లాక్‌మెయిల్' రాజకీయం?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 'నావల్ బ్లాకేడ్' వల్ల ఇరాన్ ఊపిరాడక కొట్టుమిట్టాడుతోంది. తన నౌకలను అమెరికా అడ్డుకుంటోంది కాబట్టి, దానికి ప్రతిగా భారత్ లాంటి దేశాల నౌకలను ఆపితే.. భారత్ అమెరికాపై ఒత్తిడి తెస్తుందని ఇరాన్ ప్లాన్. అంటే, తన సమస్యను పరిష్కరించుకోవడానికి భారత్‌ను ఇరాన్ ఒక 'ఆయుధం'లా వాడుకుంటోంది. భారత్‌ ఒత్తిడి పెంచితే అమెరికా దిగి వస్తుందని, తద్వారా ఈ మార్గం ద్వారా చమురును అమ్ముకోవడం సులభం అవుతుందని ఇరాన్‌ ప్లాన్‌.

పాకిస్థాన్ హస్తం ఎంతవరకు?

ప్రస్తుతం ఇరాన్-అమెరికా మధ్య పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహిస్తోంది. భారత్ ఎదుగుదలను ఏమాత్రం సహించని పాక్, ఇరాన్‌ను తప్పుదోవ పట్టించి భారత్ నౌకలపై దాడులు జరిగేలా ప్రోత్సహిస్తోందా అన్న కోణంలో భారత నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో ప్రస్తుతం భారత్‌కు చెందిన 15 నౌకలు చిక్కుకుపోయి ఉన్నాయి. దౌత్యం పేరుతో పాక్‌ నుంచి అధికారులు ఇరాన్‌ వెళ్లారు. ఇలా ఇరాన్‌ వెళ్లిన తరువాత భారత్‌కు చెందిన నౌకలపై దాడులు జరిగాయి. రెండు నౌకలను సీజ్‌ చేశారు. దీన్నిబట్టి పాక్‌ అధికారులు ఇరాన్‌పై ఒత్తిడి తీసుకొచ్చి ఉంటారని, కుట్రలు చేసి భారత్‌ నౌకలను అడ్డుకోవాలని చూస్తున్నారని, తద్వారా భారత్‌లో చమురు సంక్షోభం ఏర్పడి ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని, ఈ సంక్షోభాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని కాశ్మీర్‌లో ఉద్రిక్తతలు పెంచాలని పాక్‌ ప్లాన్‌ కావొచ్చు.

సామాన్యుడిపై ప్రభావం

ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే మన దేశంలో నిత్యావసరాల ధరలు చుక్కలను తాకుతాయి. ప్రస్తుతం గల్ఫ్‌ నుంచి రావలసిన 13 మిలియన్‌ బ్యారెళ్ల చమురు ఆగిపోయింది. ఇలానే కొనసాగితే దేశంలో చమురు ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఇప్పటికే దేశంలో ఎల్పీజీ గ్యాస్‌ కొరత తీవ్రంగా ఉంది. ఇది మరింత తీవ్రం కావొచ్చు. చమురుతో పాటు, గల్ఫ్‌ దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులు కూడా నిలిచిపోతాయి. సామాన్యుడికి ఇబ్బందులు తప్పవు.

భారత్ కౌంటర్ - 'ఆపరేషన్ సంకల్ప్'

అరేబియా సముద్రంపై భారత్‌కు మంచి పట్టు ఉంది. ఈ సముద్రంలో భారత్‌కు చెందిన దాదాపు అరడజనుకు పైగా యుద్ధనౌకలు హోర్ముజ్‌ జలసంధివద్ద ఉన్నాయి. భారత్‌ నౌకలపై దాడులు జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్‌కు వార్నింగ్‌ ఇచ్చింది. అంతేకాదు, ఇప్పటికే భారత విదేశీ వ్యవహారాల శాక ఇరాన్‌ రాయబారిని పిలిచి హెచ్చరికలు కూడా చేసింది. ఈ గొడవలో భారత్‌ను బలవంతంగా లాగితే దానికి ఇరాన్‌తో పాటు పాక్‌ కూడా తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story