Cervical Cancer: ఆస్ట్రేలియా కల సాకారమౌతుందా? క్యాన్సర్‌ను పూర్తిగా నిర్మూలించగలుతుందా?
ప్రపంచాన్ని భయపెడుతున్న మహమ్మారి క్యాన్సర్. క్యాన్సర్‌కు అడ్డుకట్ట వేసేందుకు ప్రపంచదేశాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. మరో పదేళ్లలో సర్వికల్ క్యాన్సర్ నిర్మూలన రహిత దేశంగా ఆవిర్భవించేందుకు ఆస్ట్రేలియా ప్రయత్నిస్తోంది.
Cervical Cancer: ప్రపంచాన్ని భయపెడుతున్న మహమ్మారి క్యాన్సర్. క్యాన్సర్‌కు అడ్డుకట్ట వేసేందుకు ప్రపంచదేశాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. అయితే, ఆస్ట్రేలియా ఈ విషయంలో అందరికంటే ఓ అడుగు ముందుకు వేసింది. మరో పదేళ్లలో 'సర్వికల్ క్యాన్సర్' అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను పూర్తిగా నిర్మూలించే దిశగా అడుగులు వేస్తోంది. 2035 నాటికి ఈ ఘనత సాధించిన మొదటి దేశంగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. క్యాన్సర్ ఈ రూపంలోనే వస్తుందని చెప్పలేం. కానీ, ఆధునిక వైద్య విజ్ఞానం సాయంతో ఒక రకమైన క్యాన్సర్‌ను భూమి మీద నుంచి తుడిచిపెట్టేయడం సాధ్యమేనని ఆస్ట్రేలియా పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళలను వేధించే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను అడ్డుకునేందుకు ఆ దేశం యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన చర్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
ఒక తల్లి పోరాటం - ఒక దేశం ఆశయం
మహిళలను వెంటానే సర్వికల్ క్యాన్సర్ బంధనాల నుంచి విముక్తి పొందేందుకు ఆస్ట్రేలియా ప్రయత్నిస్తోంది. దీనికి క్రిస్సీ వాల్టర్స్ అనే మహిళ కథే ఓ నిదర్శనం. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత బిడ్డకు జన్మనిచ్చిన ఆరు నెలలకే ఆమెకు క్యాన్సర్ అని తేలింది. తన కూతురు తల్లి లేని పిల్లగా పెరుగుతుందన్న భయం ఆమెను వెంటాడింది. ఇప్పుడు ఆమె కుమార్తెకు 12 ఏళ్లు నిండాయి. ఆ వయసు పిల్లలందరికీ ఆస్ట్రేలియా ప్రభుత్వం ఉచితంగా 'హెచ్‌పీవీ' వ్యాక్సిన్ ఇస్తోంది. అంటే, తన తల్లిని బలి తీసుకుంటున్న వ్యాధి తన బిడ్డ దరికి చేరకుండా ఉండేలా ఆ దేశం రక్షణ కవచాన్ని నిర్మిస్తోంది.
విజయానికి రెండు ప్రధానాస్త్రాలు
ఆస్ట్రేలియా ఈ సర్వికల్ క్యాన్సర్‌ను పూర్తిగా నిర్మూలించేందుకు రెండు పద్దతులను పాటిస్తోంది. ఒకటి 2007 నుంచే జాతీయ స్థాయిలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అమ్మాయిలతో పాటు 2013 నుంచి అబ్బాయిలకు కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వడం మొదలుపెట్టారు. అంతేకాకుండా స్క్రీనింగ్ విధానంలోనూ మార్పులు చేసింది. పాతకాలపు ప్యాప్ స్మియర్ పరీక్షల స్థానంలో, ఐదేళ్లకు ఒకసారి చేసుకునే అత్యంత సున్నితమైన హెచ్‌పీవీ పరీక్షలను ప్రవేశపెట్టింది. మహిళలు స్వయంగా శాంపిల్ సేకరించే వెసులుబాటు కల్పించడం ఇక్కడ అతిపెద్దమార్పుగా చెప్పాలి.
లక్ష్యం దిశగా గణాంకాలు
ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ప్రతి 1,00,000 మంది మహిళల్లో కొత్త కేసులు కేవలం 6.3 మాత్రమే నమోదవుతున్నాయి. శాస్త్రవేత్తల ప్రకారం, ఈ సంఖ్య 4 కంటే తగ్గితే ఆ వ్యాధి నిర్మూలించబడినట్లు లెక్క. 2021 డేటా ప్రకారం, 25 ఏళ్ల లోపు యువతుల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం. హెచ్‌పీవీ వ్యాక్సిన్లు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. 12 ఏళ్లు దాటిన యువతులకు వ్యాక్సిన్లు ఇవ్వడంతోనే సాధ్యమైనట్టు నిపుణులు చెబుతున్నారు.
సవాళ్లు లేకపోలేదు..
అయితే, గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ వ్యాక్సినేషన్ రేటు తక్కువగా ఉండటం ఒక సవాలుగా మారింది. పేద దేశాలకు అమెరికా లాంటి దేశాలు సాయం నిలిపివేయడం వల్ల ఈ క్యాన్సర్ రహిత ప్రపంచం కల నెరవేరడం కొంచెం కష్టంగా మారవచ్చు. ఏది ఏమైనా, స్వీడన్, బ్రిటన్ వంటి దేశాలతో పోటీ పడుతూ ఆస్ట్రేలియా సాధిస్తున్న ఈ పురోగతి మానవాళికి ఒక కొత్త ఆశను చిగురింపజేస్తోంది. క్యాన్సర్‌ను జయించడం అసాధ్యం కాదు, అది కేవలం సరైన నిర్ణయం, సంకల్పంతో సాధ్యమేనని ఈ "ఆస్ట్రేలియా మోడల్" చాటి చెబుతోంది. ఆస్ట్రేలియా వంటి దేశాల్లో సాధ్యమైనా...ఆస్ట్రేలియా మోడల్‌ను తీసుకొని భారత్ కూడా ఈ దిశగా అడుగులు వేస్తే బాగుంటుంది. కరోనా సమయంలో వ్యాక్సిన్ ఇచ్చిన విధంగానే మహిళల గర్భాశయ క్యాన్సర్ నుంచి విముక్తి కలిగించడం కోసం కూడా వ్యాక్సిన్లు అందించడం మేలని నిపుణులు చెబుతున్నారు.




