Baghdad Attack : బాగ్దాద్‌లో హైఅలర్ట్.. అమెరికా రాయబార కార్యాలయంపై డ్రోన్ దాడికి విఫలయత్నం

Baghdad Attack : ఇరాక్ రాజధాని బగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం సమీపంలో డ్రోన్ దాడి కలకలం రేపింది. భద్రతా దళాలు గాల్లోనే డ్రోన్‌ను కూల్చివేయగా, మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

CR Reddy
Published on: 1 July 2026 7:56 AM IST
Baghdad Attack
X

Baghdad Attack 

Baghdad Attack : ఇరాక్ రాజధాని బగ్దాద్‌లో బుధవారం (జూలై 1, 2026) ఉదయం ఘోర ప్రమాదం తప్పింది. అత్యంత భద్రతతో కూడిన గ్రీన్ జోన్ ప్రాంతంలో ఉన్న అమెరికా రాయబార కార్యాలయం (యూఎస్ ఎంబసీ) లక్ష్యంగా దూసుకొచ్చిన ఒక అనుమానాస్పద డ్రోన్‌ను ఇరాక్ రక్షణ దళాలు గాల్లోనే విజయవంతంగా కూల్చివేశాయి. ఇరాక్ భద్రతా దళాల అప్రమత్తత కారణంగా ఈ డ్రోన్‌ను సమయానికే గుర్తించి, గ్రీన్ జోన్ పైభాగంలోనే పేల్చివేయడంతో పెద్ద ముప్పు తప్పిందని ఇరాక్ సెక్యూరిటీ మీడియా సెల్ హెడ్ సాద్ మాన్ వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, ఆస్తి నష్టం కూడా జరగలేదని అధికారులు ధృవీకరించారు. ప్రభుత్వ ముఖ్య కార్యాలయాలు, విదేశీ రాయబార సంస్థలు ఉండే ఈ హై-సెక్యూరిటీ జోన్‌పై డ్రోన్ ప్రత్యక్షం కావడం తీవ్ర కలకలం రేపింది.

బగ్దాద్‌లో జరిగిన ఈ ఘటనే కాకుండా, ఉత్తర ఇరాక్‌లోని ఇర్బిల్ నగరంలోనూ ఇదే రోజు రెండు అనుమానాస్పద డ్రోన్లు కూలిపోవడం స్థానికంగా ఆందోళన కలిగించింది. అందులో ఒక డ్రోన్ నివాస గృహంపై పడగా, మరొకటి నిర్మానుష్య ప్రాంతంలో కూలిపోయింది. అదృష్టవశాత్తూ ఈ రెండు ఘటనల్లోనూ ఎవరూ గాయపడలేదు. అయితే, బగ్దాద్‌లో అమెరికా కేంద్రాలపై దాడులు జరగడం ఇది వరుసగా రెండోసారి కావడం గమనార్హం. ఒక రోజు ముందే బగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్న అమెరికా దౌత్య సహాయక కేంద్రంపై కూడా రెండు డ్రోన్లతో దాడి జరిగింది. ఈ కేంద్రం అమెరికా రాయబార కార్యాలయానికి సంబంధించిన పరిపాలన, కార్యాచరణ బాధ్యతలను చూసుకుంటుంది. ఈ వరుస దాడులకు ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా బాధ్యత వహించలేదు.

ఈ వరుస డ్రోన్ దాడుల నేపథ్యంలో ఇరాక్ ప్రధానమంత్రి అలీ అల్-జైదీ అంతర్జాతీయ సమాజానికి కీలక సందేశం ఇచ్చారు. గల్ఫ్ దేశాలపై జరుగుతున్న దాడులకు ఇరాక్ భూభాగాన్ని వాడుతున్నారనే ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని, అందుకు తగిన ఆధారాలు కూడా లేవని ఆయన స్పష్టం చేశారు. ఇరాక్ సరిహద్దులను ఏ ఇతర పొరుగు దేశాలపై దాడులు చేయడానికి ఏ సాయుధ ముఠా కూడా ఉపయోగించకుండా ఉండేందుకు తమ రక్షణ సంస్థలన్నింటికీ కఠినమైన ఆదేశాలు జారీ చేసినట్లు ప్రధాని తెలిపారు. తాము తూర్పు లేదా పశ్చిమ దేశాల ఒత్తిళ్లకు లొంగి పనిచేయబోమని, ఇరాక్ భవిష్యత్తును తమ ప్రజలే నిర్ణయించుకుంటారని ఆయన ప్రకటించారు. అమెరికా పర్యటన ముగించుకున్న జైదీ, త్వరలోనే టర్కీ, సౌదీ అరేబియా, ఇరాన్ దేశాల్లో పర్యటించనున్నట్లు వెల్లడించారు.

గత ఫిబ్రవరి నెలలో అమెరికా, ఇజ్రాయెల్ కూటమి ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై జరిపిన భారీ దాడుల్లో సుమారు 3,000 మందికి పైగా మరణించారని ఇరాన్ అధికారులు ప్రకటించారు. ఆ దాడులకు ప్రతికారంగానే ఇరాన్ సైన్యం కూడా ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా సైనిక స్థావరాలు ఉన్న గల్ఫ్ దేశాలపై డ్రోన్లు, మిసైళ్లతో విరుచుకుపడుతోంది. అప్పటినుంచి పశ్చిమ ఆసియా ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ రెండు అగ్ర దేశాల ప్రతీకార దాడుల మధ్య ఇరాక్ ఇప్పుడు వ్యూహాత్మకంగా తీవ్ర ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా మారింది. అమెరికా రాయబార కార్యాలయంపై తాజా దాడి ప్రయత్నం కూడా ఈ అంతర్జాతీయ వివాదంలో భాగమేనని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story