Bangladesh: బంగ్లాదేశ్‌లో మహమ్మారి విధ్వంసం.. 1,284 మంది మృతి
బంగ్లాదేశ్‌లో తట్టు వ్యాధి తీవ్రంగా విజృంభిస్తోంది. ఇప్పటివరకు 1,284 మంది మరణించగా, వీరిలో ఎక్కువ మంది చిన్నారులే. టీకాల కార్యక్రమం ఆలస్యం, సరఫరాలో అంతరాయాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Bangladesh Measles
Bangladesh: బంగ్లాదేశ్‌లో తట్టు వ్యాధి (Measles) తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఈ అంటువ్యాధి బారినపడి ఇప్పటివరకు 1,284 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మృతుల్లో ఎక్కువ మంది చిన్నపిల్లలే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఆరు నెలల లోపు శిశువులు ఈ వ్యాధి బారినపడి ప్రాణాలు కోల్పోతున్నట్లు అధికారులు చెబుతున్నారు. పరిస్థితి రోజురోజుకూ తీవ్రంగా మారుతుండటంతో దేశ ఆరోగ్య వ్యవస్థపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంక్షోభంపై స్పందించిన ఆరోగ్య మంత్రి సర్దార్ మొహమ్మద్ సఖావత్ హుస్సేన్.. నైతిక బాధ్యత తనదేనని అంగీకరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మరణాలపై ఆరోగ్య మంత్రి కీలక వ్యాఖ్యలు
బంగ్లాదేశ్‌లో తట్టు వ్యాధి విజృంభణను నియంత్రించడంలో ఎదురైన వైఫల్యానికి వ్యక్తిగతంగా తానే బాధ్యత వహిస్తానని ఆరోగ్య మంత్రి సర్దార్ మొహమ్మద్ సఖావత్ హుస్సేన్ పేర్కొన్నట్లు అక్కడి మీడియా కథనాలు వెల్లడించాయి. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదని, తన వ్యక్తిగత వైఫల్యంగా భావిస్తున్నానని ఆయన చెప్పినట్లు సమాచారం. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి తన వంతు ప్రయత్నం చేశానని వివరించారు. మరోవైపు టీకాల సరఫరాపై వస్తున్న విమర్శలకు కూడా మంత్రి సమాధానమిచ్చారు. మొత్తం టీకాల్లో భారత్ నుంచి వచ్చినవి కేవలం 8 శాతమేనని, మిగిలినవి ఇతర దేశాల నుంచి సేకరించినట్లు తెలిపారు.
టీకాల సరఫరాపై మంత్రి వివరణ
బంగ్లాదేశ్‌కు సరఫరా అవుతున్న తట్టు టీకాల్లో భారత్ నుంచి వచ్చినవి కేవలం 8 శాతమేనని మంత్రి స్పష్టం చేశారు. మిగిలిన టీకాలను జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియా, బ్రిటన్, దక్షిణ కొరియా, ఇండోనేషియా నుంచి తెప్పించినట్లు తెలిపారు. ఈ టీకాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పరీక్షించి ఆమోదించిందని, యునిసెఫ్ ద్వారా సరఫరా చేశారని వివరించారు. వ్యాధి బారినపడుతున్న పిల్లల్లో చాలామందికి టీకాలు వేయలేదని, ఆరు నెలల లోపు చిన్నారులు కూడా ఎక్కువగా ఉన్నారని మంత్రి పేర్కొన్నారు.
టీకాల కార్యక్రమం ఆలస్యం
బంగ్లాదేశ్‌లో 2024లో జరగాల్సిన జాతీయ తట్టు-రుబెల్లా టీకాల కార్యక్రమం వాయిదా పడటం కూడా ప్రస్తుత సంక్షోభానికి కారణాల్లో ఒకటని ఆరోగ్య రంగ నిపుణులు చెబుతున్నారు. 2025లోనూ ఈ కార్యక్రమం నిర్వహించలేకపోయారు. టీకాల కొనుగోలు విధానంలో మార్పులు, సరఫరాలో జాప్యం, సాధారణ టీకాల కార్యక్రమాల్లో అంతరాయాలు ఏర్పడటంతో చాలామంది పిల్లలకు రక్షణ లేకుండా పోయిందని నివేదికలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో గత మధ్యంతర ప్రభుత్వ హయాంలో టీకాల కొనుగోలు, పంపిణీలో జరిగిన జాప్యాలు, అవకతవకలపై విచారణకు ప్రస్తుత ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కమిషన్ ఏర్పాటు చేసింది. 60 పని దినాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
2.40 లక్షలు దాటిన అనుమానిత కేసులు
బంగ్లాదేశ్ ఆరోగ్య సేవల విభాగం (DGHS) నవంబర్ 9న విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. మార్చి 15 నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2,40,199 అనుమానిత తట్టు కేసులు నమోదయ్యాయి. వీటిలో 24,523 కేసులు ప్రయోగశాల పరీక్షల్లో నిర్ధారణ అయ్యాయి. నవంబర్ 9తో ముగిసిన 24 గంటల్లోనే 1,359 అనుమానిత కేసులు, 81 నిర్ధారిత కేసులు బయటపడ్డాయి. ఇదే సమయంలో మరో ఇద్దరు చిన్నారులు తట్టు లక్షణాలతో మరణించారు. మొత్తం 1,284 మరణాల్లో 1,179 అనుమానిత మరణాలు కాగా, 105 మరణాలు మాత్రమే ప్రయోగశాల పరీక్షల్లో తట్టుగా నిర్ధారణ అయ్యాయి. మార్చి 15 నుంచి ఇప్పటివరకు 2,14,251 మంది అనుమానిత రోగులు ఆసుపత్రుల్లో చేరగా, వారిలో 2,05,383 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.




