Bangladesh Political Crisis: రావణకాష్టంలా మారుతున్న బంగ్లా...మళ్లీ మొదలైన చిచ్చు
బంగ్లాదేశ్‌లో మరోసారి రాజకీయ హింస చెలరేగింది. షేక్ హసీనా డిసెంబర్‌లో భారత్ నుంచి తిరిగి వస్తానన్న ప్రకటనతో అవామీ లీగ్ నిరసనలు, వాహనాల దహనం, దాడులు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి.
Bangladesh Political Crisis: బంగ్లాదేశ్‌లో రాజకీయ పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారుతున్నాయి. వాహనాలకు నిప్పు పెట్టడం, బాంబు దాడులు, రాజకీయ కార్యకర్తల హత్యలు, ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తుల ఆస్తులపై దాడులతో దేశంలో ఆందోళనకర వాతావరణం నెలకొంది. ముఖ్యంగా మాజీ ప్రధాని షేక్ హసీనా డిసెంబర్‌లో భారత్ నుంచి తిరిగి బంగ్లాదేశ్‌కు వస్తానని ప్రకటించడం తాజా పరిణామాలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఆమెకు పాస్‌పోర్టు, జాతీయ గుర్తింపు కార్డు జారీ చేయడానికి ప్రభుత్వం నిరాకరించడంతో ఆమె పార్టీ అవామీ లీగ్ నిరసనలకు దిగింది. నవంబర్ 19న దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో ఇప్పటికే రాజకీయ విభేదాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస చెలరేగింది.
హసీనా రాకతో మళ్లీ రాజకీయ పోరు
2024 ఆగస్టు 5న విద్యార్థుల నేతృత్వంలో జరిగిన ఉద్యమం, ప్రభుత్వ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో షేక్ హసీనా తన 15 ఏళ్ల పాలనకు ముగింపు పలికి భారత్‌కు వచ్చారు. ఆ తర్వాత నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అనంతరం అవామీ లీగ్‌పై నిషేధం విధించారు. ఉద్యమ సమయంలో నిరసనకారుల మరణాలకు సంబంధించిన మానవత్వానికి వ్యతిరేక నేరాల కేసులో హసీనాకు మరణశిక్ష కూడా విధించారు. అయితే, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా స్వదేశానికి తిరిగి వస్తానని ఆమె ఇటీవల ప్రకటించారు. ఈ ప్రకటనతో అవామీ లీగ్ కార్యకర్తల్లో మళ్లీ రాజకీయంగా చురుకుదనం పెరిగింది. హసీనాకు కొత్త పాస్‌పోర్టు, జాతీయ గుర్తింపు కార్డు ఇవ్వాలన్న అభ్యర్థనను తారిఖ్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) ప్రభుత్వం తిరస్కరించింది. భారత్‌తో ఉన్న ద్వైపాక్షిక అప్పగింత ఒప్పందం ప్రకారం ఆమెను బంగ్లాదేశ్‌కు అప్పగించాలని కోరుతోంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అవామీ లీగ్ వారం రోజుల నిరసన కార్యక్రమాలు చేపట్టింది.
హింసాత్మకంగా మారిన నిరసనలు
నిరసనల ప్రభావం పలు ప్రాంతాల్లో కనిపించింది. బస్సులు, పికప్ వాహనాలకు నిప్పు పెట్టారు. రైల్వే ఆస్తులపై దాడులు, నాటు బాంబుల పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఢాకా-చట్టోగ్రామ్ జాతీయ రహదారిపై బస్సు, ట్రక్కుకు నిప్పు పెట్టినప్పటికీ ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బీఎన్‌పీకి చెందిన ఇద్దరు కార్యకర్తలు హత్యకు గురయ్యారని పోలీసులు తెలిపారు. హసీనా స్వస్థలమైన గోపాల్‌గంజ్‌లో ఇద్దరు బీఎన్‌పీ ఎంపీల ఇళ్లను ధ్వంసం చేసి నిప్పంటించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ఏడు జిల్లాల్లో బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్‌కు చెందిన 97 ప్లాటూన్లను మోహరించారు. ఢాకాలో అవామీ లీగ్‌తో సంబంధాలున్నాయన్న అనుమానంతో 24 గంటల్లో 107 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
యూనస్ ఆస్తులపైనా దాడులు
మాజీ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్‌కు సంబంధించిన ఆస్తులు కూడా దాడులకు గురయ్యాయి. చట్టోగ్రామ్‌లోని ఆయన పూర్వీకుల ఇంటికి బుధవారం రాత్రి నిప్పంటించారు. ఇంటి పై అంతస్తుల్లో నివసిస్తున్న కుటుంబ సభ్యులు సురక్షితంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. యూనస్ స్థాపించిన గ్రామీణ బ్యాంక్ శాఖలపైనా దాడులు జరిగినట్లు సమాచారం. నవంబర్ 10 నుంచి 19 మధ్య 40 జిల్లాల్లోని కనీసం 72 శాఖలను ధ్వంసం చేయడం లేదా తగలబెట్టడం జరిగిందని బ్యాంకు వెల్లడించింది.
భారత్‌తో సంబంధాలపైనా ప్రభావం
ఈ సంక్షోభంలో భారత్ కూడా కీలక అంశంగా మారింది. హసీనా భారత్‌లో ఆశ్రయం పొందుతున్న నేపథ్యంలో ఆమెను అప్పగించాలని ఢాకా ప్రభుత్వాలు కోరుతున్నాయి. అయితే ఆమె కొనసాగుతున్న నివాసం రెండు దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలకు కారణమవుతోంది. మరోవైపు అవామీ లీగ్ నాయకులు విదేశాల నుంచి బంగ్లాదేశ్‌లో అశాంతిని ప్రోత్సహిస్తున్నారని ప్రధాని తారిఖ్ రెహమాన్ ఆరోపిస్తున్నారు. హింస, విధ్వంసానికి పాల్పడేవారిపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. మొత్తంగా చూసుకుంటే కనుక, బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితి కేవలం హసీనా తిరిగి వస్తారా లేదా అనే అంశానికే పరిమితం కాలేదు. నిషేధిత అవామీ లీగ్ భవిష్యత్తు, యూనస్ పాలనపై ఉన్న రాజకీయ విభేదాలు, కొత్త ప్రభుత్వ స్థిరత్వం, భారత్‌తో సంబంధాలు అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడ్డాయి. ఈ పరిణామాల మధ్య సామాన్య ప్రజల భద్రత, దేశ ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతినకుండా చూడటం తారిఖ్ రెహమాన్ ప్రభుత్వానికి ప్రధాన సవాలుగా మారింది.




