Bangladesh Violence: తగలబడుతున్న బంగ్లా...బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన ఢాకా
బంగ్లాదేశ్‌లో రాజకీయ ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. ఢాకాతో పాటు పలు జిల్లాల్లో బాంబు పేలుళ్లు, బస్సుల దహనం ఘటనలు చోటుచేసుకున్నాయి. ఫరీద్‌పూర్‌లో బస్సు డ్రైవర్ సజీవదహనం కాగా, 19 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో రాజకీయ ఉద్రిక్తతలు మరోసారి హింసాత్మక రూపం దాల్చాయి. దేశ రాజధాని ఢాకాతో పాటు పలు ప్రాంతాల్లో వరుసగా వాహనాలకు నిప్పుపెట్టడం, నాటు బాంబులు పేల్చడం వంటి ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఈ దాడుల్లో ఫరీద్‌పూర్‌లో ఓ బస్సు డ్రైవర్ ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. నవంబర్ 10, మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు బస్సుకు నిప్పంటించడంతో అందులో నిద్రిస్తున్న 60 ఏళ్ల డ్రైవర్ మంటల్లో చిక్కుకున్నాడు. ఈ ఘటనతో దేశంలో భద్రతా పరిస్థితులపై ఆందోళన వ్యక్తమవుతోంది.
నిద్రలోనే మృత్యువు.. బస్సుకు నిప్పు
ఫరీద్‌పూర్‌లోని గోల్చమట్ న్యూ బస్ టెర్మినల్ సమీపంలో కిషోర్-తనోయ్ పరిబహన్కు చెందిన బస్సును నిలిపి ఉంచారు. అందులో డ్రైవర్ మహమ్మద్ కలాచన్ షేక్ నిద్రిస్తున్న సమయంలో తెల్లవారుజామున సుమారు 1.45 గంటలకు దుండగులు మంటలు పెట్టారు. స్థానికులు అతడిని బయటకు తీసి ఫరీద్పూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అప్పటికే పొగ పీల్చడం వల్ల తీవ్ర అస్వస్థతకు గురైన అతడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
ఢాకాతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ దాడులు
ఈ ఘటన ఒక్క ఫరీద్పూర్కే పరిమితం కాలేదు. ఝెనైదాలో సుమారు 35 మంది విద్యార్థులతో ప్రయాణిస్తున్న డబుల్ డెక్కర్ బస్సుపై పెట్రోల్ బాంబు విసిరినట్లు ఆరోపణలు వచ్చాయి. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు. మరోవైపు ఢాకాలోని మొహమ్మద్పూర్ ప్రాంతంలో టోక్యో స్క్వేర్ సమీపంలో రాత్రి 9.15 గంటల సమయంలో రెండు నాటు బాంబులు పేలాయి. మీర్పూర్-11 పోస్టాఫీస్ సమీపంలో మరో బస్సుకు నిప్పంటించారు. బోగురా జిల్లాలోని ఢాకా-బోగురా జాతీయ రహదారిపై జనపనార సంచులతో వెళ్తున్న వ్యాన్‌ను కూడా దహనం చేశారు. దీంతో కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఒకేరోజు ఆరు బస్సులకు నిప్పు
బంగ్లాదేశ్‌లో వాహనాలపై దాడులు ఒక ప్రాంతానికే పరిమితం కాలేదు. ది డైలీ స్టార్ కథనం ప్రకారం సోమవారం ఒక్కరోజే ఢాకా, సావర్, గాజీపూర్ ప్రాంతాల్లో ఆరు బస్సులను దహనం చేశారు. సావర్‌లో ఢాకా-అరిచా జాతీయ రహదారిపై రెండు బస్సులకు నిప్పుపెట్టారు. ఫార్మ్‌గేట్ మెట్రో స్టేషన్ కింద లవ్లీ పరిబహన్ బస్సును తగలబెట్టారు. గాజీపూర్‌లోని కలియాకైర్ ప్రాంతంలో మరో రెండు బస్సులను దహనం చేశారు. బనశ్రీ, మొహాఖాలి, ఢాకా యూనివర్సిటీ, చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు సమీపంలోనూ పేలుళ్లు నమోదయ్యాయి.
160 ప్రాంతాల్లో పోలీసుల తనిఖీలు.. 19 మంది అరెస్ట్
వరుస దాడులతో అప్రమత్తమైన ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కీలక ప్రాంతాల్లో అదనంగా 160 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి సిబ్బందిని మోహరించారు. గత 24 గంటల్లో జరిగిన దాడులు, పేలుళ్లకు సంబంధించి కనీసం 19 మందిని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. అరెస్టయిన వారిలో నిషేధిత అవామీ లీగ్‌తో సంబంధాలున్నవారు కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే తాజా దాడుల వెనుక ఎవరున్నారనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.
షేక్ హసీనా నిష్క్రమణ తర్వాత మారని రాజకీయ ఉద్రిక్తతలు
బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు గత రెండేళ్ల రాజకీయ పరిణామాలు కూడా నేపథ్యంగా ఉన్నాయి. 2024 జూలై, ఆగస్టు నెలల్లో జరిగిన ప్రజా ఉద్యమం కారణంగా అప్పటి ప్రధాని షేక్ హసీనా పదవి నుంచి వైదొలిగి భారత్‌కు వెళ్లిపోయారు. అనంతరం 2025 మేలో అవామీ లీగ్ కార్యకలాపాలపై నిషేధం విధించారు. 2026 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ పోటీకి దూరమైంది. ఆ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) విజయం సాధించింది. డిసెంబర్లో తిరిగి స్వదేశానికి వస్తానని హసీనా ఇటీవల ప్రకటించినట్లు కథనాలు వెల్లడించాయి.




