Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ రాజుకున్న అగ్గి.. యూనస్ పూర్వీకుల ఇంటికి నిప్పు

బంగ్లాదేశ్‌లో రాజకీయ ఉద్రిక్తతలు తీవ్ర హింసకు దారితీశాయి. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ లాక్‌డౌన్ పిలుపు నేపథ్యంలో 28 జిల్లాల్లో బాంబు పేలుళ్లు, వాహనాల దహనాలు జరిగాయి.

CR Reddy
Published on: 19 Nov 2026 11:35 AM IST
Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ రాజుకున్న అగ్గి.. యూనస్ పూర్వీకుల ఇంటికి నిప్పు
X

Bangladesh: బంగ్లాదేశ్‌లో రాజకీయ ఉద్రిక్తతలు తీవ్ర హింసకు దారితీశాయి. మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ నవంబర్ 19న దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు పిలుపునివ్వడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. రాజధాని ఢాకాతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో నాటు బాంబు పేలుళ్లు, వాహనాల దహనాలు, రాజకీయ నేతల ఇళ్లపై దాడులు జరిగాయి. చిట్టగాంగ్‌లో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, మాజీ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి ముహమ్మద్ యూనస్ పూర్వీకుల ఇంటికి కూడా గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. గత పది రోజుల్లో కనీసం 28 జిల్లాల్లో ఇలాంటి ఘటనలు నమోదైనట్లు వార్తా సంస్థలు వెల్లడించాయి.

చిట్టగాంగ్‌లోని పంచ్‌లైష్ ప్రాంతంలో ఉన్న ముహమ్మద్ యూనస్ పూర్వీకుల ఇంటికి బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఈ ఘటనలో ఇంటికి ఎంతమేర నష్టం జరిగిందనే వివరాలు పూర్తిగా బయటకు రాలేదు. మరోవైపు యూనస్ స్థాపించిన గ్రామీణ బ్యాంకుకు చెందిన కార్యాలయాలు, శాఖలపైనా దాడులు కొనసాగుతున్నాయి. నవంబర్ 10 నుంచి ఇప్పటివరకు కనీసం 37 గ్రామీణ బ్యాంకు కార్యాలయాలు దాడులకు గురైనట్లు బ్యాంకు వర్గాలు తెలిపాయి. వీటిలో కొన్ని చోట్ల నిప్పంటించగా, మరికొన్ని చోట్ల పెట్రోల్ బాంబులతో దాడులు జరిగినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.

మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌పై ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో నిషేధం ఉంది. అయినప్పటికీ ఆ పార్టీ నవంబర్ 19న దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చింది. గతేడాది ఇదే సమయంలో ప్రత్యేక న్యాయస్థానం హసీనాకు ఆమె గైర్హాజరీలో మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు సంబంధించిన కేసులో మరణశిక్ష విధించింది. ఆ తీర్పు వార్షికోత్సవం సందర్భంగా పార్టీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. 2024 ఆగస్టు 5న విద్యార్థుల ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో హసీనా అధికారాన్ని కోల్పోయి భారత్‌కు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆమె భారత్‌లోనే ఉంటున్నారు. డిసెంబర్‌లో తిరిగి బంగ్లాదేశ్‌కు రావాలని భావిస్తున్నట్లు వార్తలు రావడంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.

గత పది రోజుల్లో బంగ్లాదేశ్‌లోని 64 జిల్లాల్లో కనీసం 28 జిల్లాల్లో నాటు బాంబు పేలుళ్లు, వాహనాల దహనాలు నమోదయ్యాయి. ఢాకాలో పలు ప్రాంతాల్లో బాంబులు పేలడంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధాన ఫ్లైఓవర్లు, రహదారుల ప్రవేశ మార్గాల్లో అదనపు సిబ్బందిని మోహరించారు. వాహనాలను తనిఖీ చేస్తూ అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. పిరోజ్‌పూర్‌లో రెండు బస్సులకు నిప్పంటించడంతో వాటిలో నిద్రిస్తున్న ఓ బస్సు సహాయకుడు ప్రాణాలు కోల్పోయాడు. నరైల్‌లో జరిగిన దాడుల్లో ఇద్దరు అధికార పార్టీకి చెందిన స్థానిక నేతలు మరణించినట్లు వార్తలు వచ్చాయి. ఫరీద్‌పూర్‌లోనూ రాజకీయ హింసలో ఒకరు మృతి చెందినట్లు నివేదికలు వెల్లడించాయి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.