AIపై బిగ్ వార్.. ట్రంప్‌కు బిల్ గేట్స్ కౌంటర్.!

కృత్రిమ మేధ (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న కొద్దీ, దాని పురోగతిని ఏ మేరకు అనుమతించాలనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా రగులుతున్న వివాదం ఇప్పుడు..

G Krishna
Published on: 28 Sept 2026 1:21 PM IST
AIపై బిగ్ వార్.. ట్రంప్‌కు బిల్ గేట్స్ కౌంటర్.!
X

కృత్రిమ మేధ (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న కొద్దీ, దాని పురోగతిని ఏ మేరకు అనుమతించాలనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా రగులుతున్న వివాదం ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ , అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ల మధ్య నేరుగా అభిప్రాయ భేదాలకు దారితీసింది. ఏఐ రంగంలో భద్రతా నిబంధనలను కఠినతరం చేయడం వల్ల దేశ ప్రయోజనాలు దెబ్బతింటాయా లేదా రక్షణ పెరుగుతుందా అనే విషయంపై టెక్ ప్రపంచంలోనూ, రాజకీయ వర్గాల్లోనూ తీవ్రమైన చర్చ సాగుతోంది.

ట్రంప్ హెచ్చరికలు - బిల్ గేట్స్ ప్రతిపాదన

ఏఐ సాంకేతికత అభివృద్ధికి బ్రేకులు వేస్తే లేదా నియంత్రణలు విధిస్తే అమెరికా కంటే చైనా వేగంగా ముందంజ వేసే ప్రమాదం ఉందని డోనాల్డ్ ట్రంప్ తీవ్రంగా హెచ్చరిస్తూ వస్తున్నారు. అయితే ఈ వాదనతో బిల్ గేట్స్ ఏమాత్రం ఏకీభవించడం లేదు. బలమైన భద్రతా నిబంధనలను (Safeguards) అమలు చేయడం వల్ల అమెరికా తన ఆధిపత్యాన్ని కోల్పోదని, సరికాదా వాషింగ్టన్ రూపొందించే చట్టాలు , నియమాలను చైనాతో సహా ఇతర ప్రపంచ దేశాలు కూడా అనుసరించే అవకాశం ఏర్పడుతుందని గేట్స్ విశ్వసిస్తున్నారు.

'ఇది నాటకం కాదు'.. ట్రంప్ వాదనకు కౌంటర్

ఎన్‌బీసీ (NBC) కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిల్ గేట్స్ ఈ విషయమై స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. రోజురోజుకూ అత్యంత శక్తివంతంగా మారుతున్న ఏఐ సిస్టమ్‌ల వల్ల ఎదురయ్యే ప్రమాదాలను తేలిగ్గా తీసిపారేయకూడదని ఆయన స్పష్టం చేశారు. గతంలో ట్రంప్ ఏఐ ప్రమాదాల గురించిన హెచ్చరికలను ఒక 'నాటకం' (Hoax) గా అభివర్ణించగా, దానికి గేట్స్ నేరుగా కౌంటర్ ఇస్తూ "ఇది ఎంతమాత్రం నాటకం కాదు" అని తేల్చి చెప్పారు. చైనా ఇటువంటి భద్రతా చర్యలను పట్టించుకోదనే వాదనను తాను పూర్తిగా ఖండిస్తున్నానని, భద్రతా రక్షణలు అనేవి ప్రతి దేశానికి అత్యంత ఆవశ్యకమని ఆయన పేర్కొన్నారు.

ట్రంప్‌ను స్వయంగా కలవనున్న గేట్స్

సాంకేతిక రంగంలో తన జీవితకాల అనుభవాన్ని, సుదీర్ఘ పయనానికీ ఉన్న ప్రాధాన్యతను గుర్తుచేస్తూ, ఈ కీలక అంశంపై డోనాల్డ్ ట్రంప్‌తో నేరుగా మాట్లాడాలని అనుకుంటున్నట్లు బిల్ గేట్స్ వెల్లడించారు. ఏఐ సాంకేతికత ఎంత భిన్నమైనదో, దానివల్ల వచ్చే సవాళ్లు ఎంత ప్రమాదకరమైనవో వివరించి ట్రంప్ ఆలోచనల్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భద్రతా నిబంధనలను సాంకేతిక పురోగతికి అడ్డంకిగా చూడకూడదని, అత్యంత ఆధునిక ఏఐ సిస్టమ్‌ల అభివృద్ధి , వినియోగాన్ని పర్యవేక్షించడంలో ప్రభుత్వాలు క్రియాశీలక పాత్ర పోషించాలని గేట్స్ కోరారు.

ప్రభుత్వాలు, చట్టసభల పాత్ర కీలకం

ఏఐ కంపెనీలు తమకు తామే పర్యవేక్షించుకునే విధానం సరిపోదని, ప్రభుత్వాలు , చట్టసభలు తప్పనిసరిగా ఇందులో జోక్యం చేసుకోవాలని బిల్ గేట్స్ స్పష్టం చేశారు. ఏ తరహా సెక్యూరిటీ తనిఖీలు ఉండాలో నిర్ణయించడంలో రాజకీయ నాయకులు, పోలీసు , పరిశోధక సంస్థలు (Law enforcement) భాగస్వామ్యం కావాలని, అది ఒక విధిగా మారాలని ఆయన అభిప్రాయపడ్డారు. సరిగ్గా నియంత్రించకపోతే ఏఐ సాంకేతికత అత్యంత తీవ్రమైన నష్టాన్ని కలిగించే అవకాశం ఉందంటూ గేట్స్ ఇటీవల విస్తృతంగా హెచ్చరిస్తున్నారు.

రెండుగా విడిపోయిన టెక్ రంగాధిపతులు

ఏఐ నియంత్రణలపై జరుగుతున్న ఈ యుద్ధం టెక్ ప్రపంచంలోని అగ్రగామి నాయకులను రెండు వర్గాలుగా విభజించింది. ఆంత్రోపిక్ (Anthropic) సిఈఓ దారియో అమోడై, ఓపెన్ ఏఐ (OpenAI) సిఈఓ సామ్ ఆల్ట్‌మాన్ వంటి ప్రముఖులు కఠినమైన భద్రతా నిబంధనలకు మద్దతు ఇస్తుండగా, ఎన్విడియా (Nvidia) సిఈఓ జెన్సన్ హుయాంగ్, మెటా (Meta) సిఈఓ మార్క్ జుకర్‌బర్గ్ అదనపు నియంత్రణలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు ఆంత్రోపిక్ సిఈఓ దారియో అమోడైతో శ్వేతసౌధంలో డిన్నర్ సమావేశానికి ట్రంప్ సిద్ధమవుతున్నారు. ఏఐ అభివృద్ధి, భద్రతా నియమాలు కలసి ముందుకు సాగగలవా లేదా అనే వివాదం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆసక్తికరంగా మారింది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.